Burglar : దొంగతనానికి వచ్చి ఇంట్లో మంచం కింద నిద్రపోయిన దొంగ
దొంగతనానికి వచ్చిన దొంగ... చోరీ చేయకుండా మంచం కింద పడుకుని నిద్రపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Burglar : దొంగతనానికి వచ్చిన దొంగ… చోరీ చేయకుండా మంచం కింద పడుకుని నిద్రపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గోకవరంలో సత్తి వెంకట రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ ఉంటాడు. రోజూలాగే శనివారం రాత్రి కూడా 10 గంటల సమయంలో పెట్రోల్ బంక్ వద్ద పని ముగించుకుని, నిన్నటి అమ్మకం డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. వెంకట రెడ్డిని పసి గట్టిన దొంగ సూరిబాబు కూడా అతడిని ఫాలో అయ్యాడు.
వెంకట రెడ్డి ఇంట్లోకి వెళ్లగానే చాకచక్యంగా సూరిబాబు వెనకాతలే ఇంట్లో దూరి మంచంకింద దాక్కున్నాడు. వెంకట రెడ్డి నిద్రపోగానే డబ్బు ఎత్తుకెళ్లిపోవాలని ప్లాన్లో ఉన్నాడు. కానీ వెంకట రెడ్డి లెక్కలు చూసుకునే సరికి రాత్రి ఒంటిగంట వరకు పట్టింది. ఆసమయంలో మంచం కింద దాక్కున్న సూరిబాబుకు నిద్ర వచ్చి నిద్రలోకి జారుకున్నాడు. తన లెక్కలన్నీ చూసుకుని సూరిబాబు ఒంటిగంట సమయంలో నిద్రకు ఉపక్రమించాడు.
తెల్లవారు ఝామున నాలుగున్నర సమయంలో తన గదిలో గురక శబ్దం వచ్చే సరికి వెంకట రెడ్డికి మెలుకువ వచ్చింది. దీంతో ఇల్లంతా వెతికగా వెంకట రెడ్డికి మంచం కింద నిద్రపోతున్న దొంగ సూరిబాబు కనిపించాడు. వెంటనే బయటకు వచ్చి ఇల్లు గడియపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు వచ్చి మంచం కింద నిద్రపోతున్న సూరిబాబును బయటకు తీశారు. డబ్బులు అత్యవసరం అయి దొంగతనానికి వచ్చానని సూరిబాబు చెప్పాడు. వెంకట రెడ్డి దగ్గర రోజు పెట్రోల్ బంకు డబ్బులు ఉంటాయని అందుకే దొంగతనానికి వచ్చానని పోలీసు విచారణలో నిజం ఒప్పుకున్నాడు.