విశ్లేషణ : ఆరోగ్య కారణాలతో నిర్భయ దోషుల ఉరిని వాయిదా వేయొచ్చా?

  • Published By: chvmurthy ,Published On : February 20, 2020 / 01:53 PM IST
విశ్లేషణ : ఆరోగ్య కారణాలతో నిర్భయ దోషుల ఉరిని వాయిదా వేయొచ్చా?

ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్తుపట్టలేకున్నాడు. గోడకు తలను గట్టిగా కొట్టుకోవడంతో గాయమైంది. దాని ప్రభావంతో మతిస్థిమితం తప్పిందనని చెబుతున్నాడు.

లాయర్ ఏపీసింగ్ కోర్టుకు ఇలా చెప్పాడు. “కుటుంబ సభ్యుల కోరికమేరకు నేను జైలుకెళ్లాను. వినయ్ ని కలిశాడు. అతని తలకు, కుడిచేతికి గట్టిగాయాలున్నాయి. ప్లాస్టర్ వేశారు. అతనికి మానసిక రోగాలొచ్చాయి.  schizophrenia కూడా ఉంది. అందుకే ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు”.  

వినయ్ శర్మ ఎత్తులన్నీ ఉరిని ఆలస్యం చేయడానికేనని తెలిసిపోతోంది. మరి ఆరోగ్యకారణాల మీద ఉరిని వాయిదా వేస్తారా? సమాధానం…YES.

మరణశిక్ష వాయిదా మీద ఢిల్లీ ప్రిజన్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
2018 ఢిల్లీ ప్రిజన్ రూల్స్ లో రెండు నిబంధనల ప్రకారం ఆరోగ్యకారణాలమీద ఉరిని వాయిదావేయొచ్చు. మొదటి నిబంధన  ప్రకారం, మరణశిక్షను అమలుచేయాలంటే దోషికి ఆరోగ్యం సరిగా ఉండాలి. ఒకవేళ అతనికి గాయమైయ్యింది. నయమైయ్యేదాకా శిక్షను వాయిదావేయాలా? చిన్న గాయానికి, అనారోగ్యాన్ని లెక్కలోకి తీసుకోరు. అనారోగ్యం తీవ్రంగా ఉండాలి. అప్పుడే వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకొంటారు. రూల్ ప్రకారం, ఈ కేసులో సూపరింటెండెంట్ అనారోగ్యం తీవ్రత, గాయాల మోతాదు గురించి పూర్తినివేదికతో పాటు వైద్యనిపుణుల సలహానుకూడా ఇన్ స్పెక్టర్ జనరల్ కు సమర్పించాల్సి ఉంది. అవసరమైతే ఖైదీని పరిశీలనకోసం వైద్యల ముందుకు తీసుకొస్తారు.

వినయ్ శర్మ కావాలనే గాయం చేసుకున్నాడు. అలాగని ఈ ఒక్కకారణంతోనే ఉరిని వాయిదా వేయకపోవచ్చు. ఈ సంగతి దోషికి తెలుసు. అందుకే రెండో నిబంధనను కూడా వాడుకోవాలనుకున్నాడు.

రెండో నిబంధన ప్రకారం పిచ్చితనమున్నా వాయిదా వేయొచ్చు. మరణశిక్ష పడిన ఏ ఖైదీకైనా మానసిక రోగమొస్తే, వైద్యాధికారి పరిశీలిస్తాడు. నిజంగా పిచ్చి ఉందా? లేదంటే నటిస్తున్నాడా? తెలుసుకొంటాడు. వైద్యాధికారి అభిప్రాయాన్ని ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియచేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో, రూల్స్ ప్రకారం, మరణశిక్ష పడిన ఖైదీ మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి స్పెషల్ మెడికల్ బోర్డును ఎర్పాటు చేస్తారు. ఖైదీని ప్రిజన్ హాస్పిటల్ లేదంటే దగ్గర్లోని సైక్రియాటిస్ట్ పర్యవేక్షణలో ఉంచుతారు. అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత నివేదిక నిస్తారు. ఇలాంటప్పుడు దొంగవేషాలు కుదరవు.

ఇక్కడే కీలకమైన సంగతుంది. మెంటల్ కండీషన్ గురించిన వాస్తవిక ఆధారాలుండాలి. ఖైదీకి పిచ్చొచ్చిందంటే సరిపోదు. దానికి దారితీసిన పరిస్థితుల మీద ఆదారాలుండాయి. జైలు అధికారుల నివేదికలు, ప్రత్యక్ష్యసాక్షులతో సహా అతన్ని అరెస్ట్ చేసిన అధికారి నివేదిక కూడా కావాలి.  చివరి దశలో మెడికల్ స్పెషలిస్ట్ లేదంటే సివిల్ సర్జన్ నివేదికలు మెడికల్ బోర్డు ముందుంచుతారు. బోర్డుకూడా తన అభిప్రాయాన్ని చెబుతుంది. వాటన్నింటిని క్రోడీకరించిన తర్వాతనే హోంశాఖ నిర్ణయం తీసుకొంటుంది.