ఆవుల అక్రమ రవాణా కేసులో బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శితో సహా 20 మందిపై కేసు నమోదు

ఆవుల అక్రమ రవాణా కేసులో బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శితో సహా 20 మందిపై కేసు నమోదు

Cattle smuggling racket busted, BJYM leader among 20 accused in Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆవులను, ఎధ్దులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న రాకెట్ ను పోలీసులు చేధించారు. రాష్ట్రంలోని, బకోడా నుంచి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నాగపూర్ లోని కబేళాకు అటవీ మార్గం గుండా 165 ఆవులు, ఎద్దులను తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వీటి వెనుక బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆవులను తరలిస్తున్న 10మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు.

మధ్య ప్రదేశ్ లోని బకోడా గ్రామం నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ కబేళాకు 165 ఆవులు, ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లాల్బుర్రా పోలీసు స్టేషన్ కు చెందిన  పెట్రోలింగ్ పార్టీ   బైల్గావ్ -బకోడా అటవీ మార్గంలో మాటు వేసి ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంది.

ఆవులు, ఎద్దులకు సంబంధించిన అమ్మకం పత్రాలు, కోనుగోలు పత్రాలు వారు చూపించకపోవటంతో 165 పశువులను, వాటిని తరలిస్తున్న లారీలను 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.  అదుపులోకి తీసుకున్న  వ్యక్తులను ప్రశ్నించగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ పర్ధి, అరవింద్ పాథక్, అనే వారు వీటిని నాగపూర్ లోని  కబేళాకు తీసుకెళ్లమని ఆదేశించినట్లు లాల్ బుర్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రఘునాధ్ కతర్కర్ తెలిపారు.

ఆవులు, ఎద్దుల తరలింపులో మనోజ్ పర్ధి, అరవింద్ పాథక్ ప్రమేయం ఎంతవరకు ఉందో విచారించి, తగిన ఆధారాలతో వారిని అరెస్ట్  చేస్తామని పోలీసులు  తెలిపారు. ఈవిషయమై రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు  వైభవ్ పవార్ మాట్లాడుతూ… ఆవుల అక్రమ రవాణా విషయం మా దృష్టికి వచ్చిందని…. దాని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహాదారులపై పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నందున నిందితులు అటవీమార్గం గుండా పశువులను తరలిస్తున్నట్లు   ఇనస్పెక్టర్ కతర్కర్ తెలిపారు.