CBI Notice Avinash Reddy : వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.

CBI Notice Avinash Reddy : వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Viveka case

CBI Notice Avinash Reddy : వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్ కు రావాలని అవినాశ్ కు, కడపకు రావాలని భాస్కర్ రెడ్డికి శనివారం సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో రాలేనని ఆదివారం అవినాశ్ రెడ్డి రాసిన లేఖకు సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఇద్దరి విచారణను కూడా సీబీఐ వాయిదా వేసింది. మార్చి 10వ తేదీన విచారణకు రావాలని అవినాశ్ కు, 12వ తేదీన రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.

వివేకా హత్య కేసులో తొలి నుంచి భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను సీబీఐ ప్రశ్నిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. నిందితులు వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సమావేశమయ్యారని సీబీఐ సాంకేతిక ఆధారాలు సేకరించింది. పక్కా ఆధారాలు లభించడంతో నిందితులతో భాస్కర్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవాలని సీబీఐ అనుకుంటోంది. ఈ విషయంపై భాస్కర్ రెడ్డిని ప్రశ్నించేందుకు గత నెల (ఫిబ్రవరి)లో విచారణకు రావాలని నోటీసులు సీబీఐ ఇచ్చింది. గత నెల ఫిభ్రవరి 18న విచారణకు రావాలని తొలిసారి సీబీఐ నోటీసు ఇచ్చింది.

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు

సీబీఐ విచారణకు సంసిద్ధం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్ల మరో తేదీన వస్తానని అప్పట్లో కోరారు. ఆయన వినతిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ మార్చి 12 తేదీలోపు విచారణకు రావల్సిందిగా గత నెల (ఫిబ్రవరి) 26న నోటీసులు సీబీఐ ఇచ్చింది. మళ్లీ ఏమనుకుందో ఏమో ఈరోజు సోమవారం విచారణకు రావాలని గత శనివారం నోటీసు అందజేసింది. అదే సమయంలో హైదరాబాద్ విచారణకు హాజరు కావాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో అవినాశ్ ఇంట్లో లేకపోవడంతో భాస్కర్ రెడ్డికే నోటీసులు అందజేసింది.

కానీ, వేరే కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. తనతో పాటే తన తండ్రి విచారణ కూడా వాయిదా వేయాలని కోరారు. భాస్కర్ రెడ్డిని విచారణకు రమ్మంటూ రెండు సార్లు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా సీబీఐ ముందు హాజరు కాలేదు. కుటుంబ కార్యక్రమం ఉందని ఒకసారి, పార్టీ పని ఉందని మరోసారి వాయిదా కోరారు. ఆయన వినతిపై సీబీఐ సానుకూల వైఖరే ప్రదర్శించింది. రెండుసార్లు వాయిదాకు ఛాన్స్ ఇచ్చింది.

Google Takeout : వైఎస్ వివేకా కేసులో కీలకంగా మారిన గూగుల్ టేకౌట్.. అసలేంటీ గూగుల్ టేకౌట్? ఎలా యూజ్ అవుతుంది?

ఈ కేసులో భాస్కర్ రెడ్డిపై తొలి నుంచి వైఎస్ వివేక కుమార్తే సునీత ఆరోపణలు చేస్తూనేవున్నారు. తన తండ్రిని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికే హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కడపలో విచారణ జరిగితే న్యాయం జరుగదన్నారు. విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని సునీత న్యాయం పోరాటం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాతే భాస్కర్ రెడ్డి విచారణకు సీబీఐ నోటీసు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

భాస్కర్ రెడ్డి..వరుసకు వివేకకు సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ కు సమీప బంధువు. పులివెందుల రాజకీయమంతా ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాసర్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి తన పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు వివేక కేసులో ఆయనను సీబీఐ ప్రశ్నించనుండటం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కడప, పులివెందులలో పలువురిని విచారించిన సీబీఐ కొందరిని అరెస్టు చేసింది.