చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: గుజరాత్ లో దొరికిన దొంగలు

  • Published By: chvmurthy ,Published On : January 27, 2019 / 01:39 PM IST
చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: గుజరాత్ లో దొరికిన దొంగలు

జోగుళాంబ గద్వాల: జనవరి 5 గద్వాలలోని వేణుగోపాల్ అపార్ట్‌మెంట్‌లో దొంగతనానికి ప్రయత్నించిన చెడ్డీగ్యాంగ్ ముఠాలోని సభ్యులను గద్వాల పోలీసులు గుజరాత్ లో అరెస్టు చేశారు. సీసీ కెమెరాలో లభించిన ఆధారాలతో, సైబరాబాద్ పోలీసుల సహకారంతో, వీరిని గుజరాత్ లో గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. 
గుజరాత్ రాష్ట్రంలోని దోహద్ జిల్లా మాలిఫాలియా తాలూకా దస్లా గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ సంగాడ వీర్‌సింగ్ భాయ్ , సిమ్లియా కుర్ద్ కచల ఫాలియా గ్రామానికి చెందిన రోజు కూలీకి వెళ్లే  మఖోడియా ఖనీష్‌భాయ్ లతో పాటు అదే రాష్ర్టానికి చెందిన కమల్, రాజు సంగాడ, సోము సింగ్ లు వ్యసనాలకు గురై దొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 4న అర్ధరాత్రి సమయంలో గుజరాత్ నుంచి రాయచూర్ డెమో రైలులో గద్వాలకు చేరుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వేణుగోపాల్ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి అక్కడి కొన్ని ఇళ్ల తలుపులను తట్టారు. ఎవరూ తీయకపోవడంతో తాళం వేసిన మధుబాబు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి అర తులం బంగారం, రూ.12,000 నగదును  దోచుకున్నారు. 
అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా నిక్కరు ధరించిన ఈ గుజరాత్ ముఠా సభ్యులు.. చేతిలో మారణాయుధాలు పట్టుకుని ఇళ్ల తలుపులను కొట్టిన దృశ్యాలు కనిపించాయి. అందులో దొరికిన ఆధారాలతో గద్వాల పోలీసులు సైబరాబాద్ పోలీసుల ను సంప్రదించారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో ప్రత్యేక విమానంలో గుజరాత్ వెళ్లి నేరస్థలంలో దొరికిన సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెల్ ఫోన్ డాటా, నిందితుల ఫోటోలను పరిశీలించి అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఐదుగురు దొంగలలో సంగాడ వీర్‌సింగ్ భాయ్, మఖోడియా ఖనీష్‌భాయ్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని  గద్వాల డీఎస్పీ షాకీర్‌ హుస్సేన్ తెలిపారు.వీరు గత ఏడాది కాలంగా కర్నూలు, హైదరాబాద్,కర్ణాటకలోని ఎరిగెరలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.