జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 01:30 AM IST
జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జయరాం మర్డర్‌.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్యకు సహకరించిన వారెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసులు సమాధానాలు రాబడుతారని అతని కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల ప్రజలే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఏం తేల్చబోతున్నారు?

నందిగామ పోలీసులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను నిందితులుగా తేల్చారు. శ్రిఖాచౌదరి పాత్ర, ప్రమేయంపైనా స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు మాత్రం ఈ కేసులో నిందితులైన రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులతోపాటు రౌడీషీటర్‌ నగేష్‌, అతని మేనల్లుడు విశాల్‌ పాత్రనూ బయటపెట్టారు. నిందితుల కస్టడీ కూడా ముగిసింది. జయరాం భార్య పద్మశ్రీ..శ్రిఖా చౌదరిపై అనుమానం వ్యక్తం చెయ్యడం..ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మళ్లీ శ్రిఖాను విచారణకు పిలిచారు. ఎక్కడ కూడా శ్రిఖాకు హత్యకు ప్రమేయం ఉన్నట్లు తేలకపోవడంతో చివరికి ఆమెపై ఇంట్లోకి అక్రమంగా చొరబడి విలువైన వస్తువులు తీసుకెళ్లారన్న కేసుని నమోదు చెయ్యనున్నారని సమాచారం. 

మరోవైపు జయరాంను హత్య చేయడానికి రాకేష్‌రెడ్డి పన్నిన పన్నాగంలో ఆర్టిస్ట్‌ సూర్య బలి అయ్యాడు. జయరాంను రాకేష్‌రెడ్డి అతని స్నేహితుడు కిశోర్‌తో ఇంటి వరకు వచ్చేలా పథకం రచించాడు. మర్డర్‌ ప్లాన్‌ తెలియని ఆర్టిస్ట్‌ సూర్య, కిశోర్‌ ఇద్దరూ జయరాంను రాకేష్‌రెడ్డి ఇంటి వరకు కారులో తీసుకొచ్చారు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత  టీవీల్లో చూసి షాక్‌ అవ్వడం సూర్య వంతైంది. హత్య విషయం తెలిసిన తర్వాత కూడా పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదన్నదే ప్రధాన ప్రశ్న. రాకేష్‌రెడ్డి కేసులో సూర్యను సాక్షిగా తేలుస్తారా లేక నిందితుడిగా అనేది సందిగ్దంగా మారింది.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి భూకబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్స్‌ కోసం పోలీసులతో సంబంధాలు పెంచుకున్న రాకేష్‌రెడ్డికి ఇంకా ఎంతమంది సహకరించారన్నది తేలాల్సి ఉంది. 

చివరకు ఈ కేసులో ఏం తేలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎవరు కీలకపాత్ర పోషించారు, ఎవరు రాకేష్‌రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు  సమాధానాలు పోలీసులే రాబట్టాలి.