లాక్ డౌన్ తో బయటపడ్డ  ప్రియుడి బాగోతం

  • Published By: murthy ,Published On : May 1, 2020 / 12:41 PM IST
లాక్ డౌన్ తో బయటపడ్డ  ప్రియుడి బాగోతం

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, రోజువారి వేతన జీవులు, కూటికి లేని పేదలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే కానీ దీనవల్ల కాపురాలు కూలి పోయే పరిస్ధితి వచ్చింది. ఇన్నాళ్ళూ ఆఫీసులకు వెళ్ళి మగరాయుళ్లు వెలగబెట్టిన ప్రేమ వ్యవహారాలు  ఒక్కటొక్కటిగా బయట పడటంతో కాపురాల్లో చిచ్చులు మొదలయ్యాయి.  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి తనకు పెళ్లైన విషయం దాచి పెట్టి ఆఫీసులోని సహోద్యోగితో ప్రేమాయణం సాగించాడు. 
 

ఇంట్లో ఇల్లాలు, ఆఫీసులో ప్రియురాలు లాగా ఇద్దరినీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు.కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో అతడి బండారం బయట పడింది. లాక్ డౌన్ టైంలో  ప్రియుడు నుంచి సరైన సమాచారం రాకపోవటం…అతను ఫోన్ లో  కూడా దొరక్కపోవటంతో అతడ్ని వెతుక్కుంటూ వెళ్లిన ప్రియురాలికి షాకిచ్చాడు. హాయిగా భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్న ప్రియుడ్ని చూసి ఆ యువతి మోసపోయానని గ్రహించింది. 
 

సాయి కిరణ్, శ్రీలక్ష్మి లు (పేర్లు మార్చాం)  హైదరాబాద్ లోని ఒక  MNC లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.  ఒకే ఆఫీసులో  పనిచేయటంతో వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అలా మొదలైన వారి  స్నేహం కొద్ది రోజుల్లో ప్రేమ గా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా  ఇద్దరూ షికార్లు కెళ్లి, సరదాలు తీర్చుకున్నారు.  
 

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా  ప్రభుత్వం  మార్చి 25 నుంచి లాక్‌ డౌన్‌ ప్రకటించింది. దీనికంటే ముందే చాలా మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే తమ విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు.   ఏమైందో ఏమో కానీ..  వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన తర్వాత నుంచి శ్రీలక్ష్మికి , సాయికిరణ్ నుంచి ఫోన్లు, మేసేజ్‌లు రావడం ఆగిపోయాయి. కొన్నాళ్లకు  ఆమె నంబర్‌ కూడా బ్లాక్‌ చేసినట్లు గుర్తించింది. ప్రియుడి జాడ లేక  శ్రీలక్ష్మి అల్లాడిపోయింది. అసలు తననెందుకు దూరం పెట్టాడో..తన నెంబరు ఎందుకు బ్లాక్ చేసాడో  తెలుసుకోవాలనే ఆరాటంతో కొంత మంది సహోద్యోగులు ద్వారా అతడి ఇంటి  అడ్రస్ తెలుసుకోగలిగింది.
 

వన్ ఫైన్ మార్నింగ్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీలక్ష్మికి……. భార్య ఒడిలో తల పెట్టుకుని తాపీగా టీవీ చూస్తున్న సాయికిరణ్  కనపడ్డాడు.  షాక్‌ తిన్న శ్రీలక్ష్మి, సాయి కిరణ్ దుమ్ము దులిపేసింది. సాయి భార్య కూడా అతడిని నిలదీసింది. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని  సాయి ఆత్మహత్య చేసుకుంటానంటూ  బెదిరించి రోడ్డు మీదకు వెళ్లాడు. 
 

మహిళలిద్దరూ పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి అతడిని కాపాడి, కౌన్సిలింగ్ ఇచ్చారు.  ఇలాంటి  అక్రమ సంబంధాల కేసులు ఎన్నో లాక్ డౌన్ సమయంలో బయట పడుతున్నాయంటున్నారు పోలీసులు. లాక్‌డౌన్‌లో ఎంతోమంది దొంగ ప్రియుళ్లు, దొంగ భర్తల బండారాలు బట్టబయలవుతున్నాయని పోలీసులు వివరించారు. తీరా లాక్‌డౌన్‌ ముగిసే సమయానికి ఎన్ని కాపురాలు ఉంటాయో, ఎన్నికూలతాయో అని వాపోతున్నారు.