భూవివాదాల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

  • Published By: murthy ,Published On : December 11, 2020 / 03:24 PM IST
భూవివాదాల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

congress leader murdered ,due to land disputes : కరీంనగర్ జిల్లాలో భూ వివాదాల నేపధ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద మనుషుల పంచాయితీలో సమస్య పరిష్కరించుకుందామని నమ్మ బలికి ….. ప్రత్యర్థులు మాటువేసి హత్య చేశారు. కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థులు గొడ్డలితో కిరాతకంగా నరికి చంపటంతో . ఈ ఘటన స్థానికంగా అలజడికి కారణమైంది.

శంకరపల్లి మండలం మెట్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సంపత్‌కి అదే గ్రామానికి చెందిన ఓదయ్యతో భూతగాదాలున్నాయి. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్‌ వరకూ వెళ్లారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

అయితే పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. పెద్దల సమక్షంలో సర్ధుబాటు చేసేందుకు శుక్రవారం పంచాయితీ పెట్టారు. అంతకు ముందు రోజే గురువారం సంపత్ పొలం వద్దకు వెళ్లాడు.



ఆ సమయంలో మరోమారు ఓదయ్యతో ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్న ఓదయ్య కొడుకు జంపయ్య కోపంపట్టలేక సంపత్‌‌పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై కిరాతకంగా నరకడంతో సంపత్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పోలీసులు భారీగా గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.



తన కొడుకు హత్యలో పోలీసుల ప్రమేయం ఉందంటూ మృతుడి తండ్రి రాజలింగం ఆరోపించడం చర్చనీయాంశమైంది. భూవివాదాల నేపథ్యంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఓదయ్యకే వత్తాసు పలికారని సంపత్ తండ్రి ఆరోపించాడు. మండలానికి చెందిన మరో ప్రజాప్రతినిధిపైనా ఆయన విమర్శలు చేశారు. మృతుడి తండ్రి ఆరోపణలు నేపథ్యంలో ఘటనా స్ధలానికి చేరుకున్న కేశవపట్నం ఎస్సైని అక్కడి నుంచి అధికారులు పంపించేయడం గమనార్హం.