కర్నాటకలో కలకలం : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 03:34 AM IST
కర్నాటకలో కలకలం : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

కర్నాటక రాష్ట్రంలో ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిందితుడు దాడి చేయడం కలకలం రేపుతోంది. కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి మైసూరులో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే…నరసింహ రాజా శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున తన్వీర్ సేఠ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన మాజీ మంత్రి. నవంబర్ 17వ తేదీ ఆదివారం మైసూరులోని బన్నీ మంటపంలోని బాలభవన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హజరయ్యారు. అంతా సందడిగా ఉంది. పెళ్లికి హాజరైన వారితో ఎమ్మెల్యే సేఠ్ మాట్లాడుతున్నారు. ఓ యువకుడు ఎమ్మెల్యేపై వైపు వస్తూనే కత్తితో మెడపై, శరీరంపై పొడిచాడు. ఒక్కసారిగా ఈ పరిణామంతో షాక్‌కు గురయ్యారు.

వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే అనుచరులు, పెళ్లికి హాజరైన వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న సేఠ్‌ను సమీపంలోని కొలంబియా ఏషియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యే పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. 
Read More : చలికి గడ్డ కట్టని డీజిల్
ఎమ్మెల్యే మీద హత్యాయత్నం చేసిన యువకుడు ఫర్హాన్ పాషా గుర్తించారు. ఇతను మైసూరు నగర వాసి. అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 
> కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 
> డిసెంబర్ 05వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 09న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 
> నవంబర్ 11 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
> దాదాపు 37 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.