cops arrested two cops : పోలీసు స్టేషన్ కే కన్నం వేసిన ఇంటి దొంగలు అరెస్ట్

cops arrested two cops : పోలీసు స్టేషన్ కే కన్నం వేసిన ఇంటి దొంగలు అరెస్ట్

Veeravasaram Police Station

cops arrested two cops for veeravasaram police station Rs.8 Lakh stolen case : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లో చోరీకి గురైన మద్యం షాపులకు చెందిన 8లక్షల రూపాయల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ నిందితులు కానిస్టేబుల్స్ కావటం గమనార్హం. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ కేసును త్వరిగతిన దర్యాప్తు పూర్తి చేయించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఉసురుమర్తి గంగాచలం(31), గొర్రెల గోనేశ్వరరావు (35) అనే కానిస్టేబుళ్లు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి రూ. 8,04,330 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఉసురుమర్తి గంగాచలం 2013లో డిపార్డ్ మెంట్ లో చేరి పేకాట ఆడుతూ పట్టుబడి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇటీవలే 28.01.2021 వ తేదిన సస్పెన్షన్ నుండి తిరిగి విధులలోకి జాయిన్ అయ్యి వీరవాసరం పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

రెండవ నిందితుడు అయిన గొర్రెల గణేశ్వర రావు అలియాస్ గణేష్ కూడా గతం లో తాడేపల్లిగూడెంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కి గురై, ఇటీవలే తిరిగి విధులలోకి జాయిన్ అయినాడు. ట్రాన్సఫర్ లలో భాగం గా 23.12.2020 వ తేదీన వీరవాసరం పోలీస్ స్టేషన్ కు వచ్చి అప్పటి నుండి ఈ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్నాడు.

కాగా… మార్చి 16వ తేదీన ప్రభుత్వ మద్యం దుకాణంలో జరిగిన అమ్మకాల నగదు, ఆ తర్వాతి రోజు వరుసగా బ్యాంకులకు సెలవు రావటంతో మద్యం షాపుల సూపర్ వైజర్లు ఆ నగదును పోలీసు స్టేషన్ లో భద్రపరిచారు. ఈవిషయం నిందితులిద్దరూ తెలుసుకున్నారు. వారిద్దరూ ఆరోజు రెస్ట్ లో ఉన్నారు.

ఆనగదు కాజేయాలని ప్లాన్ చేసి మొదట గంగాచలం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు  వచ్చి పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ముందుగా దాచిన ఒక ఇనుప పైపు ను తీసుకువచ్చి లాకప్ గది తాళం పగలగొట్టాడు. అందులో నగదు ఉంచిన బాక్స్ ని బయటకు తీసుకువచ్చి సీలు చింపి ట్రంక్ బాక్స్ తాళం పగలగొట్టాడు. అందులో ఉన్న నగదును తీసుకుని లాకప్ గది తాళంని దగ్గరలో గల బావిలో పడవేసాడు.

సీలు చింపిన కాగితాలను, బాక్సు గోళ్ళెంతో పాటు తాళం ని పోలీస్ స్టేషన్ వెనుక ప్రహరి గోడ పక్కన పడవేసాడు. మళ్లీ యధావిధిగా పక్కనే ఉన్న వేరే లాకప్ గది తాళంని,  పగలగొట్టిన లాకప్ గదికి యదావిధిగా ఎవరికి అనుమానం రాకుండా తాళం వేసి గణేష్ వద్దకు వెళ్లి పోయాడు.

అక్కడ వాటాల ప్రకారం ఇద్దరూ డబ్బులు పంచుకున్నారు. తరువాత మళ్ళీ పోలీసులకు వారి మీద అనుమానం వస్తుందేమో అన్న భయంతో ఇద్దరూ ఆ డబ్బును వీరవాసరం గ్రామం లో తూర్పు చెరువు సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న పొదలలో దాచారు.

అయితే గంగాచలం తాము పంచుకున్న డబ్బుతో,  తను ఉంటున్న తులసి కన్వెన్షన్ సెంటర్ వద్దకు వచ్చి అక్కడ చెత్తలో సదరు డబ్బుని ఉంచాడు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి నిందితులిద్దరినీ గుర్తించారు. అప్పటి నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారు.

కాగా చెత్తలో దాచి ఉంచిన డబ్బును గంగాచలం  తర్వాత తీసుకు వెళ్ళడం సీసీ ఫుటేజ్ ద్వారా కూడా గమనించారు. పోలీసులు గాలింపులో భాగంగా ఈరోజు ఉదయం (20.03.2021) నిందితులిద్దరినీ వీరవాసరం మడుగు వంతెన వద్ద అరెస్టు చేసారు. వారి ఇచ్చిన సమాచారంతో దొంగలించిన డబ్బును, పగలగొట్టిన తాళం ని, చింపేసిన సీలు కాగితాలను, విరగ్గొట్టిన ట్రంక్ బాక్స్ తాళం మరియు గొళ్ళెంని మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు స్వాధీన పరచుకున్నారు.