నిన్న ఆన్‌లైన్‌ గేమ్స్‌, నేడు క్రికెట్ బెట్టింగ్.. యువత ప్రాణాలు తీస్తున్నాయి

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 11:24 AM IST
నిన్న ఆన్‌లైన్‌ గేమ్స్‌, నేడు క్రికెట్ బెట్టింగ్.. యువత ప్రాణాలు తీస్తున్నాయి

cricket betting taking youth lives: ఐపీఎల్‌ ముందు వరకు ఆన్‌లైన్‌ గేమ్స్‌ యువత జీవితాలను బలిగొన్నాయి. ఆటల కోసం అప్పులు చేసి కొందరు…ఆటలాడొద్దని మందలించినందుకు మరికొందరు…ఉసురు తీసుకున్నారు. ఇక ఐపీఎల్‌ సమయంలో జోరుగా సాగిన బెట్టింగ్‌లు..మరెందరో జీవితాలను నాశనం చేశాయి. ప్రాణాలను సైతం తీశాయి. ఇలా ఆటల మోజులో పడి యువత బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటుండటం ఆందోళన కల్గిస్తోంది.

బలికోరిన క్రికెట్‌ బెట్టింగ్‌.. పురుగుల మందు తాగించిన పందెం.. ఒకరు మృతి..ఆస్పత్రిలో మరొకరు.. బెట్టింగ్‌ నిర్వాహకులకు కాసుల పంట.. జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత..

గుంటూరులో విషాదం, బెట్టింగ్ లో లక్షలు కోల్పోయి ఆత్మహత్య:
క్రికెట్‌..ఈ ఆటకు అభిమానులెక్కువ. అభిమాన క్రికెటర్‌ ఆట ఆడుతున్నాడంటే వారికి ఎక్కడలేని సంతోషం. అయితే ఆ అభిమానం ఉండటంలో తప్పు లేదు. క్రికెట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయడంలోనూ తప్పు లేదు. కానీ..యువత అక్కడితో ఆగడం లేదు. ఆటను చూసి ఎంజాయ్‌ చేసి వదిలేయకుండా…బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఫలితంగా బంగారం లాంటి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా…బెట్టింగ్‌లో లక్షలు రూపాయలు కోల్పోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా…మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. గుంటూరులో జిల్లాలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది.

బెట్టింగ్ నిర్వాహకుడికి డబ్బులు చెల్లించలేక సూసైడ్:
బెల్లంకొండకు చెందిన సురేశ్‌(22), కొమురయ్య(21)…క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్ష రూపాయల వరకూ పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడికి ముప్పై వేలు చెల్లించారు. మరో 80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. ఆ డబ్బు ఏ రూపంలోనూ వచ్చే మార్గం కన్పించ లేదు. దీంతో చావే శరణ్యమనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించారు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సురేశ్‌ మృతి చెందగా… మరో యువకుడు కొమురయ్య ప్రాణాలతో పోరాడుతున్నాడు.

బెట్టింగ్ కాదు టెన్షన్:
అయితే…తాను క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడలేదని.. టెన్షన్లతోనే పురుగుల మందు తాగినట్లు కొమురయ్య తెలిపాడు. సురేష్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవాడని చెప్పాడు. తాము శనివారం పురుగుల మందు తాగామని వెల్లడించాడు. ప్రస్తుతం తాను మాట్లాడలేకపోతున్నట్లు తెలిపాడు.

తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు:
కొమురయ్య, సురేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమురయ్య సోదరుడు సతీష్ తెలిపాడు. బెట్టింగ్‌లో డబ్బులు కొల్పోయామని తమను అడిగితే ఆ డబ్బులు తాము ఇచ్చే వాళ్లమని, ఇలా ప్రాణాలు తీసుకువడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సోదరుడు సురేశ్‌కి ముందు నుంచి క్రికెట్ బెట్టింగ్ అలవాటు లేదని తెలిపాడు మృతుడు సోదరుడు చంద్రయ్య. తిరుపతి రావు అనే వ్యక్తి తన సోదరుడి మృతికి కారణమయ్యాడని, అతనే క్రికెట్ బెట్టింగ్‌లను అలవాటు చేశాడని చెప్పాడు. సత్తెనపల్లిలో ఉన్న బాజీ అనే వ్యక్తికి డబ్బులు చెల్లించలేకనే సురేశ్‌ ప్రాణాలు తీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యాడు.

పారాక్విట్ అనే ఎలుకల మందు తీసుకున్న యువకులు:
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమురయ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, మూడు రోజులు గడిస్తే కానీ పూర్తి స్థాయిలో చెప్పలేమని GGH సూపరింటెండెంట్ ప్రభావతి చెప్పారు. వారు పారాక్విట్ అనే ఎలుకల మందు తీసుకున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ మందు తీసుకుని ప్రాణాలతో బయటపడిన వారు చాలా అరుదుగా ఉన్నారని వెల్లడించారు.

ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి:
ఇలా.. బెట్టింగ్‌లకు పాల్పడే వారు…ఆపై ఆత్మహత్యలకు పాల్పడే వారు…ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. క్షణికావేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు…మీ తల్లిదండ్రులను జీవితాంతం కోలుకోకుండా చేస్తాయి. మిమ్మల్ని కని..పెంచి..ఓ స్థాయికి తీసుకువచ్చిన తర్వాత…మీరు ఇలా అర్థరాంతరంగా తనువు చాలిస్తూ…తల్లిదండ్రులకు కడుపుకోతను మిగల్చడం ఎంతవరకు కరెక్ట్‌. క్రికెట్ అనే కాదు.. ఏ బెట్టింగ్‌లకు పాల్పడినా..నష్టాలే తప్ప..లాభమేమి ఉండదు. ఇకనైనా ఆలోచించి ముందుడుగు వేయండి. జీవితాలను కాపాడుకోండి.