Online Cheating : ఏపీలో వెలుగు చూసిన రూ.200 కోట్ల భారీ మోసం

ఆంధ్రప్రదేశ్ లో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. నిందితులు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశారు.

Online Cheating : ఏపీలో వెలుగు చూసిన రూ.200 కోట్ల భారీ మోసం

On Line Cheating

Online Cheating :  ఆంధ్రప్రదేశ్ లో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. నిందితులు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశారు. కోవిడ్ టైంలో అవసరమైన ఆక్సిజన్ సిలిండెర్లు, వ్యాక్సిన్ లు,ఇతరవైద్య పరికరాలు అద్దెకు ఇచ్చే పేరుతో భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు. లవ్ లైఫ్ అండ్ నేచుర‌ల్ హెల్త్ కేర్ పేరుతో రూ.200 కోట్ల‌కు టోక‌రా వేశారు.

రూ.500 మొదలు రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు విలువైన హెల్త్ ప‌రిక‌రాల‌ను ఆన్‌లైన్ పెట్టి సంస్థ‌ అమ్మకాలు  జరిపింది. కరోనా సమయంలో ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. వారికి అవసరమైన వైద్య పరికరాలు, ఆస్పత్రుల్లో వినియోగించే ఇన్‌ఫ్రాస్టక్చర్ మొత్తాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది నేచురల్  హెల్త్ కేర్ సంస్ధ. వినియోగదారులు కొన్న పరికరాన్ని ఆస్పత్రులకు, ప్రజలకు  అద్దెకు ఇవ్వటం వల్ల తొందరలోనే పెట్టిన  పెట్టుబడి తిరిగి వస్తుందని, ఆ పరికరం మీ పేరునే ఉండిపోతుందని నమ్మించింది.

Also  Read : AP Covid Update : ఏపీలో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు

ఇది అంతా చెయిన్, లింక్ సిస్టం ద్వారా, సోషల్ మీడియాలో రిఫరల్ కోడ్ ద్వారా వినియోగ దారులనుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. డబ్బులు కట్టిన వారి పేరుతో ఒక వైద్య పరికరం కొనుగోలు చేసినట్లు సృష్టించారు. ఆ వైద్య పరికరాన్ని ఆస్పత్రులకు అద్దెకు ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుంది. మీకు ఆదాయం వస్తుందని సంస్ధ ప్రచారం చేసుకుంది.  దీంతో లక్షలాది మంది సభ్యులు వైద్య పరికరాలు కొన్నారు. వారు కొన్న పరికరాలను ఏనాడు వారు చూడలేదు, కానీ సంస్ధ ఆ పరికరాలను అద్దెకు ఇచ్చినట్లు భ్రమింప చేసినట్లు ఒక బాధితురాలు తెలిపింది.

ఒక్కో ప‌రిక‌రానికి రీఛార్జి పేరుతో సంస్ధ డ‌బ్బులు వ‌సూలు చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు రీఛార్జి అని.. ఇంకో వస్తువు రీ చార్జి అనే పేరుతో ప్రజల వద్దనుంచి డబ్బులు వసూలు చేసింది. కొంతమందికి  వారు కొన్న వైద్య పరికరాలకు  అద్దె డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.  రీ చార్జి చేసుకున్న ప్రతి ఒక్కరికి రూ.100 నుంచి రూ.2వేల వ‌ర‌కు బహుమతులు వస్తాయని ఆశ చూపి ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కట్టించుకుంది.

సంస్ధ చెప్పిన ప్రకారం వినియోగదారులకు ఎటువంటి బహుమతులు రాక పోగా… రాను రాను వారు కొన్న వైద్య పరికరాలకు అద్దె కూడా చెల్లించక పోవటంతో ఈ బండారం బయటపడింది. దీంతో బాధితులు  విజ‌యవాడ సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో న్యాయ‌వాదులు, పోలీసులు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సంస్ధ  బాధితుల్లో 20ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని స‌మాచారం. పోలీసు విచారణలో సంస్ధ ఏ రకంగా ప్రజలను మోసం చేసిందనే పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.