ఘరానా మోసం, ఆ మేసేజ్ ద్వారా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ నుంచి రూ.70వేలు కొట్టేశారు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జస్ట్ ఒక మేసేజ్ తో అడ్డంగా

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 08:39 AM IST
ఘరానా మోసం, ఆ మేసేజ్ ద్వారా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ నుంచి రూ.70వేలు కొట్టేశారు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జస్ట్ ఒక మేసేజ్ తో అడ్డంగా

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జస్ట్ ఒక మేసేజ్ తో అడ్డంగా దోచేస్తున్నారు. చెమట చిందించకుండా వేలు, లక్షలు కాజేస్తున్నారు. అమాయకులనే కాదు బాగా చదువుకున్న వారిని కూడా మోసగిస్తున్నారు. చివరకు బ్యాంకు ఉద్యోగులను కూడా వదలడం లేదు. తాజాగా ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సైతం అడ్డంగా బుక్కయ్యాడు. కేవలం ఓ మేసేజ్ పంపి ఆయన అకౌంట్ నుంచి రూ.70వేలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. 

నిజమో అబద్దమో తెలుసుకోకుండా ఫోన్ చేశాడు:
మీ ఖాతాలోంచి రూ.25వేలు డ్రా అయ్యాయి.. డ్రా చేసింది మీరు కాకుంటే.. వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి.. ఇదీ ఓ రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు వచ్చిన మేసేజ్. ఈ మేసేజ్ చూసిన ఆయన కంగారు పడ్డాడు. ఇది నిజమో అబద్దమో తెలుసుకోకుండా సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకున్నారు. వాళ్లు ఫోన్‌ చేసి డెబిట్‌ కార్డు వివరాలు అడిగితే.. సదరు బాధితుడు మాత్రం క్రెడిట్‌ కార్డు వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పేశాడు. ఇంకేముంది అకౌంట్ నుంచి రూ.70వేలు మాయం అయ్యాయి. ఆ తర్వాత తాను మోసపోయానని తెలిసి లబోదిబోమన్నాడు. సోమవారం(మే 25,2020) సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మీ ఖాతా నుంచి రూ.25వేలు డ్రా అయ్యాయని మేసేజ్:
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నివసించే ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ మేనేజర్‌ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో మీ బ్యాంకు ఖాతా నుంచి హఫీజ్‌పేటలో రూ.25 వేలు డ్రా అయ్యాయి. డ్రా చేసింది మీరు కాకపోతే వెంటనే మా కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయండంటూ అందులో సారాంశం ఉంది. ఈ మేసేజ్ చూసిన ఇది నిజమేనేమోనని కంగారుపడ్డాడు. తాను బయటకు వెళ్ల లేదని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఖాతాలో నుంచి డబ్బు డ్రా చేశారేమోనని ఆందోళన చెందాడు. హడావుడిగా అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఫోన్‌లో కార్డు.. ఖాతా  వివరాలు చెప్పేశాడు. సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పాలని సైబర్ నేరగాళ్లు అడగడంతో దానిని కూడా చెప్పాడు. 

కంగారులో క్రెడిట్ కార్డు వివరాలు కూడా చెప్పేశాడు:
అలాగే, కంగారులో బాధితుడు తన దగ్గరున్న క్రెడిట్‌ కార్డు వివరాలు కూడా చెప్పేశాడు. దీంతో ఆ కార్డు నుంచి రూ.70 వేలు మొబిక్విక్‌ వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బు డ్రా అయినట్టు మరోసారి సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న  బాధితుడు సోమవారం సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి బ్యాంక్‌  ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉండగా.. క్రెడిట్‌ కార్డు వివరాలు ఎందుకు చెప్పారంటూ బాధితుడిని పోలీసులు ప్రశ్నించారు. మీ దగ్గరున్న కార్డు వివరాలు చెప్పండంటూ అడగడంతో క్రెడిట్‌ కార్డు వివరాలు కూడా చెప్పాల్సి వచ్చిందని బాధితుడు పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

బ్యాంకు పేరుతో మేసేజ్ లు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి:
కొంతకాలంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. చాలా ఈజీగా మోసం చేసేస్తున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి అడ్డంగా దోచేస్తున్నారు. డెబిడ్ కార్డు వివరాలతో పాటు ఓటీపీ సేకరించి లూటీ చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పేరుతో వచ్చే మేసేజ్ ల పట్ల, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంకు అధికారులు, పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయినా కొందరు మోసపోతూనే ఉన్నారు.

Read: పిల్లల ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి.. 40మందికి అస్వస్థత