చోరీల్లో సూర్య అన్న స్టైలే వేరు….ఉదయం గం.10 నుంచి సాయంత్రం 5 వరకే డ్యూటీ చేస్తాడు

  • Published By: murthy ,Published On : December 9, 2020 / 12:16 PM IST
చోరీల్లో సూర్య అన్న స్టైలే వేరు….ఉదయం గం.10 నుంచి సాయంత్రం 5 వరకే డ్యూటీ చేస్తాడు

Cyberabad police have arrested a thief : చదివింది టెన్త్ క్లాసు…ఫంక్షన్ హాల్లో తండ్రితో కలిసి ఉద్యోగం. కానీ జల్సాలకు అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అందుకు డబ్బు కావాలి. దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నాడు. దానికి ఒక టైమింగ్ పెట్టుకున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపే చోరీ చేస్తాడు. ఏది పడితే అది చోరీ చేయడు… బంగారం, నగదు తప్ప ఇంకేమీ ముట్టుకోడు సూర్య అన్న. ఇదీ ఇతని చోరీ స్టైల్ మొత్తం 86 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ ఘరానా దొంగ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.

హైదరాబాద్ టోలీ చౌక్ పారామౌంట్ కాలనీకి చెందిన కాజాం అలీఖాన్, అలియాస్ సూర్య అన్న (28) చెడు వ్యసనాలకు బానిసై 16 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు చేయటం ఫ్రారంభించాడు. దొంగతనం చేసిన సొమ్ముతో గోవా వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. లాక్ డౌన్ కంటే ముందు 70 చోరీలు చేసాడు, ఆ తర్వాత ఇంకో 16 చోరీలు చేసాడు. మొత్తం 86 చోరీలయ్యాయి.



2015లో జూబ్లీహిల్స్‌, 2016లో మీర్‌పేట్‌, 2018లో సంగారెడ్డి పోలీసులు అతడిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. గత ఫిబ్రవరిలో జైలు నుంచి వచ్చి ఆగస్టు నుంచి మళ్లీ మొదలుపెట్టాడు. 4 నెలల్లో సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 16 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఎవరి సహాయం తీసుకోడు. ఒంటరిగానే వెళతాడు. పోలీసులకు చిక్కకుండా ముప్ప తిప్పలు పెట్టేవాడు.
ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకొస్తాడు. ఎలక్ట్రీషియన్ లాగా చొక్కా పై జేబులో అందరికీ కనపడేలా టెస్టర్ పెట్టుకుంటాడు. ఇంటి తాళాలు పగలకొట్టే పరికరాలు లోదుస్తుల్లో దాచి పెడతాడు. వాహనంపై బయలుదేరి ఖరీదైన అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ గా ఉన్న ఖరీదైన ఇళ్లు టార్గెట్ చేస్తాడు.



ఎలక్ట్రీషియన్ గా పరిచయం చేసుకుని అపార్ట్ మెంట్ వాచ్ మెన్ లకు చెప్పి లిఫ్టులో రెండు మూడు సార్లు పైకి కిందకూ తిరుగుతాడు. తాళం వేసి ఉన్న ప్లాట్లను గుర్తిస్తాడు. మెట్ల మార్గంలో ప్లాట్ కు వెళ్లి తాళం పగలకొట్టి చోరీ చేస్తాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా హెల్మెట్ పెట్టుకుంటాడు. చోరీ, చోరీకి వాహనం మారుస్తాడు. దీంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగసాగాడు. ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

chor hyderabad