శ్రామిక్ ప్రత్యేక రైలు టాయిలెట్ లో మృతదేహం

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 12:49 PM IST
శ్రామిక్ ప్రత్యేక రైలు టాయిలెట్ లో మృతదేహం

ఉత్తరప్రదేశ్ లోని శ్రామిక్ స్పెషల్ రైలు టాయిలెట్ లో మృతదేహం లభ్యమైంది. రాష్ట్రంలోని ఝాన్సీ రైల్వేస్టేషన్ లో రైలును శుభ్రం చేస్తున్న సమయంలో శ్రామిక్ ప్రత్యేక రైలులోని టాయిలెట్ లో ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. 45 ఏళ్ల వ్యక్తి గోరక్ పూర్ కు వెళ్లేందుకు రైలు ఎక్కాడు. మే 23న ఝాన్సీ నుంచి బయలుదేరిన రైలు.. మే 24 న గోరక్ పూర్ చేరుకుంది. 

అనంతరం రే నిర్వహణ, శానిటైజేషన్ కోసం అధికారులు తిరిగి 27న ఝాన్సీకి పంపించారు. ఆ సమయంలో స్టేషన్ కార్మికులు బోగీలోని టాయిలెట్లను శుభ్రం చేసేందుకు వెళ్లగా మృతదేహం కనిపించింది. దీంతో అధికారులకు సమాచారం అందించారు. మృతుడు రాష్ట్రంలోని బస్తీ జిల్లాకు చెందిన మోహన్ లాల్ శర్మగా గుర్తించారు. 

మృతుడు మోహన్ లాల్ శర్మ ముంబాయిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం. అతని దగ్గర ఉన్న ఆధార్ కార్డు, గోరక్ పూర్ వెళ్లేందుకు తీసుకున్న రైల్వే టికెట్, మరికొన్ని డాక్యుమెంట్స్ తోపాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అతను ముంబాయి నుంచి పలు రైళ్లు మారుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అతను మృతి చెందిన రైలులో ఆ సమయంలో ఎలాంటి అనుమానాస్పద సంఘటన జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.