Iphone Murder : షాకింగ్.. విద్యార్థి ప్రాణం తీసిన ఐఫోన్ పిచ్చి.. కాల్చి చంపిన క్యాబ్ డ్రైవర్

ఐఫోన్ పై మోజు ఓ కుర్రాడి ప్రాణం తీసింది. ఐఫోన్ కోసం రూ.72వేలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చకపోవడంతో అతడి ప్రాణమే పోయింది.

Iphone Murder : షాకింగ్.. విద్యార్థి ప్రాణం తీసిన ఐఫోన్ పిచ్చి.. కాల్చి చంపిన క్యాబ్ డ్రైవర్

Iphone Murder : ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అందరి జీవితాల్లో భాగమైపోయాయి. చిన్న పెద్ద, పేద ధనిక.. అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు ఈజీగా అయిపోతున్నాయ్. దీంతో మనందరి జీవితంలో ఫోన్ ఒక భాగంగా మారింది. కాగా, స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే అనర్థాలూ ఉన్నాయ్. కొంతమంది తిండి, నీరు, నిద్ర లేకపోయినా ఉండగలరేమో కానీ, చేతిలో ఫోన్ లేకుండా అస్సలు ఉండలేరు. అంతలా అడిక్ట్ అయిపోయారు. మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఫోన్ పిచ్చి ఏకంగా ప్రాణాలే తీస్తోంది.

తాజాగా.. ఐఫోన్ పై మోజు ఓ కుర్రాడి ప్రాణం తీసింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి అబ్దుల్లా ఐఫోన్ కోసం క్యాబ్ డ్రైవర్ ఖలీద్ దగ్గర రూ.72వేలు అప్పు చేశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ అడిగినా.. అబ్దుల్లా పట్టించుకోలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన క్యాబ్ డ్రైవర్ ఖలీద్.. అబ్దుల్లాను పిస్టల్ తో కాల్చి చంపాడు. తానే అబ్దుల్లాను చంపినట్లు పోలీసుల విచారణలో అతడు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సౌత్ ఈస్ట్ జామియా నగర్ లో ఈ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ వయసు 24ఏళ్లు. 12వ తరగతి విద్యార్థి ఐఫోన్ కొనేందుకు బాట్లా హౌస్ జామియా నగర్ లో నివాసం ఉండే క్యాబ్ డ్రైవర్ ఖలీద్ దగ్గర అప్పు చేశాడు. అజీమ్ డైరీ ఏరియాలో శుక్రవారం సాయంత్రం 4.10 గంటల సమయంలో విద్యార్థిని క్యాబ్ డ్రైవర్ కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరుడు మహమ్మద్ అబ్దుల్లాను.. క్యాబ్ డ్రైవర్ కాల్చి చంపిన సమయంలో తాను ఇంటి లోపల ఉన్నట్లు అబ్దుల్లా సోదరుడు ఆసిఫ్ చెప్పాడు. కాల్పుల శబ్బం విని బయటకు పరిగెత్తి వచ్చి చూసే సరికి తన సోదరుడు అబ్దుల్లా రక్తపు మడుగులో పడి ఉన్నాడని ఆసిఫ్ తెలిపాడు. ఐపీసీ సెక్షన్ 302(మర్డర్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆయుధాల చట్టం కింద కేసు బుక్ చేశారు.

ఐఫోన్ కొనుక్కునేందుకు తాను అబ్దుల్లాకు రూ.72వేలు ఇచ్చానని క్యాబ్ డ్రైవర్ ఖలీద్ పోలీసుల విచారణలో తెలిపాడు. తన డబ్బు ఇచ్చేయాలని ఎన్ని సార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని, దీంతో తానే అబ్దుల్లాను కాల్చి చంపానని అతడు ఒప్పుకున్నాడు.

”శుక్రవారం సాయంత్రం 4గంటలకు అబ్దుల్లాను కలిశాను. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలని అడిగాను. అయితే అబ్దుల్లా నాకు డబ్బూ ఇవ్వలేదు, ఐఫోన్ కూడా ఇవ్వలేదు. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. దీంతో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను కోపంతో రగిలిపోయాను. నా వెంట తెచ్చుకున్న కంట్రీ మేడ్ పిస్టల్ తో అబ్దుల్లాను కాల్చి చంపా. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయా” అని పోలీసుల విచారణలో చెప్పాడు క్యాబ్ డ్రైవర్ ఖలీద్. ఖలీద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి నుంచి పిస్టల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు.