టీవీ నటి కారును వెంబడించి, వేధించిన నలుగురు అరెస్ట్

టీవీ నటి కారును వెంబడించి, వేధించిన నలుగురు అరెస్ట్

Delhi Police arrest 4, for chasing & verbally abusing Tv actress Prachi Tehlan : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఒక టీవీ నటి కారును వెంబడించి ఆమెను అసభ్య పదజాలంతో వేధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. బాస్కెట్ బాల్ ప్లేయర్, టీవీ నటి ప్రాచీ తెహ్లాన్ సోమవారం రాత్రి తన భర్తతో కలిసి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు నలుగురు వ్యక్తులు ఒక కారులో వారి కారును వెంబడించారు.

మధువన్‌ చౌక్‌కు చేరుకోగానే  దుండగులు ఆమె కారును ఓవర్ టేక్ చేసి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలబెట్టారని ప్రాచీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో దుండుగుల వాహానాన్ని తప్పించుకుని ముందుకు వెళ్లామని ఆమె తెలిపారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు  దిగారని తెలిపారు.

తమ కాలనీ గేటు వరకూ కారులో ఫాలో అయ్యారని … ప్రశాంత్‌ విహార్‌లోని తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్య  పదజాలంతో దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తన భర్తతో కలిసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రాచీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. నిందితులు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రాచీ తెహ్లాన్‌ భారత బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి. గతంలో జట్టుకు కెప్టెన్‌గా సారధ్యం వహించారు. 2010లో  కామన్‌వెల్త్ ‌ క్రీడా పోటీలకు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం 2016లో టీవీ నటిగా మారింది.  ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’ అనే టీవీ షోతో ఆమె మంచి గుర్తింపు పొందింది.  2017లో పంజాబీ సినిమా ‘అర్జన్‌’లో ప్రాచీ నటించింది.