ఢిల్లీలో అల్లర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 11:08 AM IST
ఢిల్లీలో అల్లర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య

ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. మరో 200 మంది దాకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడిన వారికి అత్యవసర రక్తం అవసరం అవ్వగా… పారామిలిటరీ బలగాలు అందిస్తున్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ బ్యాంకులో BSF, CISF, CRPF, ITBP జవాన్లు ఈ రక్తదానం చేస్తున్నారు. 

అల్లకల్లోలంగా మారిన ఉత్తర, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసుల భారీ పహారా మధ్య ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో 10 గంటలపాటు కర్ఫ్యూని సడలించడంతో జనం వీధుల్లోకి వస్తున్నారు. 4 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. ఇటు చాంద్‌బాగ్‌ ప్రాంతంలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఇక శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గురుగ్రామ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. 

Also Read | Delhi Riots : చిన్న ఆస్పత్రి ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది

మరోవైపు శాంతి భద్రతలపై ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ గురువారం, ఫిబ్రవరి 29వ తేదీ శుక్రవారం ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన టెన్త్‌, ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే… దివ్యాంగులైన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిసైడైంది. ప్రస్తుతం ఢిల్లీలోని చాలా చోట్ల స్కూళ్లు తెరచుకోలేదు.

దుకాణాలు కూడా మూసివేసి ఉన్నాయి. చాలా కుటుంబాలు ఢిల్లీ నుంచీ వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి… అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. ఇటు కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అల్లర్లకు ఎవరు పాల్పడ్డారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో అన్నీ దర్యాప్తు జరిపిస్తోంది. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే హింస, అల్లర్లకు సంబంధించి 514 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 48 మందిపై FIRలు నమోదైనట్లు తెలిపింది. 

Read More : వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ నుంచి పెట్రోల్ రేట్ల పెరుగుదల