దివ్య కేసు : పరారీలో వెంకటేష్.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దివ్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ కోసం

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 05:04 AM IST
దివ్య కేసు : పరారీలో వెంకటేష్.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దివ్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ కోసం

తెలంగాణలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దివ్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా వెంకటేష్ ఆచూకీ దొరకలేదు. ఇంటికి తాళం వేసి వెంకటేష్ పారిపోయాడు. వెంకటేష్ కుటుంబసభ్యులు కూడా అందుబాటులో లేరు. వారి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. హంతకుడు వెంకటేష్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాసేపట్లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్య మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దివ్య కుటుంబసభ్యులు, బంధువులు, మహిళా సంఘాల వాళ్లు ఆసుపత్రికి చేరుకున్నారు. దివ్యను పొట్టన పెట్టుకున్న ఉన్మాది వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే:
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో దివ్య అక్కడ 8వ తరగతి చదివింది. ఆ సమయంలోనే క్లాస్‌మేట్‌ అయిన వెంకటేష్‌.. దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి బాధ పడలేక వారు ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. వెంకటేశ్‌ గౌడ్‌ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించిన పోలీసులు.. మరోసారి ఆమె వెంటపడనంటూ అతడితో కాగితం రాయించుకుని వదిలేశారు. 

ఫిబ్రవరి 26న దివ్య పెళ్లి.. ఇంతలో దారుణం:
కొన్నాళ్ల పాటు ఊరుకున్న వెంకటేశ్‌.. మళ్లీ దివ్య వెంట పడడం ఆరంభించాడు. అతడి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఆమె మాత్రం బాగా చదువుకుంది. 4 నెలల క్రితమే ఏపీజీవీ బ్యాంకు గజ్వేల్‌ శాఖలో ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే దివ్యకు వరంగల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. 26న వివాహం జరగాల్సి ఉంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చింది. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

వెంకటేశ్ ను ఉరితీయాలి:
కూతురు దారుణ హత్యకు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిర్జీవంగా పడి ఉండడంతో బోరున విలపించారు. తమ కూతురిని దారుణంగా హతమార్చిన నిందితుడు వెంకటేష్‌ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో విచారణ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు దివ్య కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వారం రోజుల్లో బంధువులతో కళకళలాడాల్సిన దివ్య ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read More>>ఇంత నిర్లక్ష్యమా?: గాంధీ ఆస్పత్రిలో జనరల్ వార్డ్‌లోనే స్వైన్‌ఫ్లూ చికిత్స