విశాఖ రేవ్ పార్టీలో డ్రగ్స్

  • Published By: chvmurthy ,Published On : April 17, 2019 / 06:03 AM IST
విశాఖ రేవ్ పార్టీలో డ్రగ్స్

విశాఖపట్నం: సాగర తీరంలో డ్రగ్స్‌ సంస్కృతి జడలు విప్పుతోంది. వీకెండ్‌ పార్టీల పేరుతో యువత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను వినియోగిస్తోంది. బొంబాయి, హైదరాబాద్‌లాంటి నగరాలకు పరిమితం అయిన రేవ్ పార్టీ  కల్చర్‌ విశాఖ తీరాన్ని తాకింది. రుషికొండ సమీపంలోని బీచ్‌ ఫ్రంట్‌ రిసార్ట్‌లో నిర్వహించిన ఒక పార్టీలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది. రేవ్‌ పార్టీ కల్చర్‌ ఇప్పుడు సౌత్‌నూ ఆక్రమిస్తోంది. నార్త్‌ ఇండియాకు ఒకప్పుడు పరిమితమైన ఈ కల్చర్‌.. ఇప్పుడు సౌత్‌లోనూ విస్తరిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాలకు సౌత్‌లో పరిచయమైన ఈ రేవుపార్టీలు… సాగరతీరమైన విశాఖనూ తాకింది. రేవ్‌ పార్టీ పేరిట కొత్త సంస్కృతిని విశాఖ యూత్‌ దిగుమతి చేసుకుంటోంది. నిషేధిత మత్తు పదార్థాలతో రేవ్‌ పార్టీలను నిర్వహిస్తోంది. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీలాంటి మత్తుపదార్థాలను నిర్వాహకులు యూత్‌కు అలవాటు చేస్తున్నారు.  

విశాఖ నగరానికి చెందిన సోను అనే వ్యక్తి రుషికొండలోని ఓ రిసార్ట్‌ను ఒకరోజు అద్దెకు తీసుకున్నాడు. శనివారం అక్కడ సుమారు 50మంది యువకులు, పదిమంది యువతులతో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో మద్యం వినియోగించుకునేందుకు వీలుగా ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే పార్టీలో మద్యంతోపాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్‌ఎస్‌డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడరులాంటి అత్యంత మత్తు కలిగించే మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచారు. ఇదే ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంది.

కాశీనరేంద్ర అనే మరో వ్యక్తి విశ్వనాథ్‌ బీచ్‌ఫ్రంట్‌ రిసార్ట్స్‌ నిర్వహిస్తున్నాడు. వారాంతపు రోజుల్లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతి పొందాడు. అయితే శనివారం అర్థరాత్రి 12 గంటల సమయంలోనూ ఫుల్‌ డీజే సౌండ్స్‌తో పార్టీ హోరెత్తింది. దీనిపై కొందరు  ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే ఆ తనిఖీల్లో ఏమీ దొరకలేదంటూ వెనక్కి వచ్చింది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా పార్టీ జరుగుతుంటే వారిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  విశాఖకు చెందిన ఓ మంత్రి అనుచరుడి కారణంగానే ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

రేవ్ పార్టీలపై తీవ్ర దుమారం రావడంతో పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న మనకొండ సత్యనారాయణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి ఒక గ్రామ ఎండీఎంఏ మత్తు పదార్థంతోపాటు ఎల్‌ఎస్‌డీ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రేవ్‌ పార్టీలో నిషేధిత మత్తు పదార్థాలను వినియోగించినట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి పార్టీ నిర్వాహకులు సాయి రాఘవ్‌చౌదరి, సోను అనే యువకుడితోపాటు మరికొందరిని ఆరా తీశారు. సత్యనారాయణ తానే గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చినట్టు అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ఏయూ ఇంజనీరింగ్‌ హాస్టల్స్‌లో మత్తుపదార్థాల అంశం పెద్ద దుమారమే లేపింది. విశాఖ నగరంలో గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలు ఎక్కువగా ఉన్నచోట గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు వీటిని  అరికట్టటంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.