అనుమానంతో ప్రియురాలి హత్య..శవంతో ప్రయాణం

  • Published By: chvmurthy ,Published On : March 16, 2020 / 12:46 PM IST
అనుమానంతో ప్రియురాలి హత్య..శవంతో ప్రయాణం

అనుమానం పెనుభూతం అయ్యింది ఆ ప్రేయసి ప్రియుల మధ్య….. రాను రాను ప్రియురాలిపై పెరిగిన అనుమానంతో ప్రియుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.శవాన్ని 45 నిమిషాలపాటు కారులో పెట్టుకుని ప్రయాణించి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.  చేసిన నేరానికి త్వరలో శిక్ష అనుభవించబోతున్నాడు. 2019 జులైలో దుబాయ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్ధానిక కోర్టు ఆదివారం మార్చి15, 2020 న విచారణ చేపట్టింది.  
 

భారత్ కు చెందిన 27 ఏళ్ల యువకుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్‌ కి చెందిన  ఒక యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమాయణం కొన్ని రోజుల పాటు సజావుగా సాగింది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న వీరి ప్రేమాయణంలో అనుమానం అనే పెను భూతం చిచ్చు పెట్టింది.

తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని  ఆ  యువకుడికి అనుమానం వచ్చింది. ఈవిషయమై ఆమెను నిలదీశాడు. ఆమె అలాంటిదేమీ లేదని చెప్పినా తరచూ ఆమెతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో ఇటీవల కారులో ఆమెను తీసుకువెళ్లి… నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి… చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు. కారు ముందు సీట్లో ప్రియురాలి శవాన్ని పెట్టుకుని దాదాపు 45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఓ హోటల్‌లో ఆగి భోజనం చేశాడు. అనంతరం డైరాలోని పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసు ఆదివారం విచారణకు వచ్చింది. 

ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రక్తం నిండిన దుస్తులతో అతడు పోలీసు స్టేషనులో అడుగుపెట్టగానే నేను షాకయ్యాను. వణుకుతున్న గొంతుతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేశానని చెప్పాడు. బాధితురాలి మృతదేహం అతడి కారు ముందు సీట్లోనే ఉంది. గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. వెనుక సీట్లో పెద్ద కత్తిని మేం స్వాధీనం చేసుకున్నాం.

తనను మోసం చేసిందనే అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు’’ అని కోర్టుకు తెలిపారు. అదే విధంగా బాధితురాలి హత్యకు ముందు ఆమెను చంపేస్తానంటూ  ప్రియురాలి కుటుంబ సభ్యులకు ఇ-మెయిల్‌ పంపినట్లు గుర్తించినట్లు  పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సదరు యువకుడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ వాదించారు. ఇందుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వెలువడనుంది.