మరో మన్మధుడు….పెళ్లైన, మిడిల్ ఏజ్ ఆంటీలే టార్గెట్ 

  • Published By: murthy ,Published On : May 31, 2020 / 08:21 AM IST
మరో మన్మధుడు….పెళ్లైన, మిడిల్ ఏజ్ ఆంటీలే టార్గెట్ 

తమిళనాడులోని రామనాథపురంలో మరో మన్మధుడు పోలీసులకు చిక్కాడు. మిడిల్ ఏజ్ మహిళలు, పెళ్లైన వారినే టార్గెట్ గా చేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఈ మీసాలు కూడా రాని మన్మధుడు. వీడి బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేక ఫోన్ నెంబరు కూడా ప్రకటించారు పోలీసులు. 

ఇటీవలే కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో కాశీ అనే మన్మధుడు యువతులను టార్గెట్ గా చేసుకుని సాగించిన లీలలు, మోసాలు బయటపడటంతో కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రామనాథపురం మన్మధుడి లీలలు బయట పెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. 

రామనాథపురం పరమకుడికి చెందిన ఒక ఉద్యోగి శుక్రవారం మే 29న ఎస్పీ వరుణ్ కుమార్ కు ఒక ఫిర్యాదు చేశాడు. తన భార్య చిత్రాల్ని మార్ఫింగ్ చేసి ఎవరో యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తన భార్య తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోందని చెప్పాడు. తాను ఆ యువకుడితో మట్లాడగా రూ.20 వేలు ఇవ్వాలని కోరాడని చెప్పాడు. రూ.20 వేలు ఇవ్వకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

యువకుడిని పట్టుకునేందుకు పధకం రచించారు. ఆ యువకుడు అడిగిన మొత్తం ఇవ్వటానికి ఆ ఉద్యోగి సిధ్ధమైనట్లు సమచారం పంపించారు. డబ్బు ఎక్కడ, ఏ టైమ్ కు అందివ్వాలో చెప్పమన్నాడు ఉద్యోగి.  శనివారం మే30, తెల్లవారుఝూమున ఆ యువకుడు చెప్పిన చోటికి డబ్బుతో సహా వెళ్లాడు ఉద్యోగి. డబ్బుతీసుకోటానికి అక్కడకు వచ్చిన యువకుడిని… అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్ గా గుర్తించారు. యువకుడు స్ధానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

సరిగ్గా మీసాలుకూడా రాని రోహిత్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లైన ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సప్ ల ద్వారా యుక్త వయసు దాటిన మహిళలు, పెళ్లైన మహిళలతో పరిచయాలు పెంచుకోవటం చేసేవాడు. వారు పరిచయం అయ్యాక వారి ఫోటోలు డౌన్లోడు  చేసుకుని వాటిని మార్ఫింగ్ చేసి వారికే పంపించేవాడు. వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తన కోరికలు తీర్చాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. వీరిలో కొందరిని లొంగదీసుకున్నట్లు… మరికొందరి వద్ద డబ్బు తీసుకున్నట్లు ప్రాధమికంగా గుర్తించారు పోలీసులు. 

అతడి సెల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. రోహిత్ ఫోన్ నిండా మార్ఫింగ్ చేసిన మహిళల ఫోటోలే ఉండటంతో, ఇతగాడి బాధితులు ఎక్కువ మందే ఉంటారని భావించారు. రోహిత్ బాధితులు ఎవరైనా ఉంటే  ఫిర్యాదు చేయటానికి ముందుకు రావాలని ప్రత్యేక సెల్ ఫోన్ నెంబరును ప్రకటించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పిన ఎస్పీ వరుణ్ కుమార్ నిందితుడి నుంచి మరిన్ని విషయాలు  రాబట్టే పనిలో ఉన్నారు.