తుపాకీతో మాజీ మంత్రి గుత్తా హల్ చల్, చంపుతానని అధికారులకు బెదిరింపులు, అరెస్ట్ చేసిన పోలీసులు

  • Published By: naveen ,Published On : August 31, 2020 / 08:52 AM IST
తుపాకీతో మాజీ మంత్రి గుత్తా హల్ చల్, చంపుతానని అధికారులకు బెదిరింపులు, అరెస్ట్ చేసిన పోలీసులు

నల్గొండ జిల్లాలో ఓ మాజీ మంత్రి తుపాకీతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. తుపాకీతో అధికారులను బెదిరించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

ఆ మాజీ మంత్రి పేరు గుత్తా మోహన్ రెడ్డి. తన భూమిలో నుంచి కాల్వను తవ్వవద్దంటూ పనిచేస్తున్నవారిని అడ్డుకోవడమే కాకుండా తుపాకీతో బెదిరించారు ఆయన. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో పిల్లాయిపల్లి కాల్వ పనులను మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి అడ్డుకున్నారు. గ్రామంలో సర్వే ప్రకారం కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. అయితే తన భూమిలోంచి కాల్వ వెళ్లొద్దని గుత్తా మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు అక్కడ పని చేస్తున్న ఇంజినీర్‌ ను, జేసీబీ డ్రైవర్‌ను చంపుతానని తుపాకీతో బెదిరించారు.

సైట్‌ ఇంజినీర్‌ నరేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు గుత్తాపై కేసు నమోదు చేశారు. తుపాకీ స్వాధీనం చేసుకోవడంతోపాటు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుత్తా మోహన్ రెడ్డి 1978, 83లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో నెల పాటు వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.

సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాలువ వెళ్లొద్దంటూ గుత్తా వాగ్వాదానికి దిగారని ఇంజినీర్‌, జేసీబీ ఆపరేటర్ తెలిపారు. పనులు నిలిపేయాలంటూ తుపాకీతో తమని బెరించారని వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.