మృతదేహాలతో మాజీ ఎమ్మెల్యే ధర్నా

  • Published By: chvmurthy ,Published On : May 12, 2019 / 07:22 AM IST
మృతదేహాలతో మాజీ ఎమ్మెల్యే ధర్నా

కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద  శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మృతదేహాలతో  గద్వాజ జిల్లా వడ్డేపల్లిలో  కర్నూలు-రాయచూరు జాతీయరహాదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు.  కాగా …… వెల్ధుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియాను, వారి పిల్లల చదువులు ప్రభుత్వమే భరిస్తుందని  ఆర్డీఓ రాములుప్రకటించారు.

తెలంగాణలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లక్ష్మన్న కుటుంబం, వారి దాయాదులు కలిసి రెండు జీపుల్లో గుంతకల్లుకి  పెళ్లి సంబంధం మాట్లాడుకోటానికి వెళ్లారు. మధ్యాహ్నం  పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని అంతా సంతోషంగా గడిపారు. అదే ఆనందంలో పురుషులందరూ ఒక జీపులో, మహిళలు మరో వాహనంలో సాయంత్రం సొంతూరుకు బయల్దేరారు. అయితే.. పెళ్లి ఖాయమైందన్న ఆనందం వారిలో ఎక్కువ సేపు నిలవలేదు. తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు కాటేసింది.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు..వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర…పురుషులు ప్రయాణిస్తున్న జీపును వాయువేగంతో వచ్చి ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ ఎదురుగా వచ్చిన  బైక్ ను తప్పించబోయి  తుఫాను వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తుఫానులో ఉన్న 16 మందిలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో 14 మంది ఒకే గ్రామానికి చెందిన వారు. సమీప  బంధువులు కావటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది ఈ ప్రమాద ఘటనపై  తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.