ఏం జరిగింది : చిగురుపాటి హత్యలో మిస్టరీ వీడేనా

ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత, కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురయ్యారు. జనవరి 31వ తేదీ గురువారం రాత్రి కృష్ణా జిల్లా

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 12:35 PM IST
ఏం జరిగింది : చిగురుపాటి హత్యలో మిస్టరీ వీడేనా

ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత, కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురయ్యారు. జనవరి 31వ తేదీ గురువారం రాత్రి కృష్ణా జిల్లా

విజయవాడ : ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత, విజయవాడ కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్ చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ వీడేనా.. ఎందుకు చంపారు.. చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది ఆసక్తిగా మారింది. 2019, జనవరి 31వ తేదీ గురువారం రాత్రి కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవే పక్కన కారులో జయరామ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్పాట్‌లో ఆధారాల ప్రకారం పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. ఆర్థిక లావాదేవీలే దీనికి కారణమన్న పోలీసులు.. నిందితుల కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు.

 

చిగురుపాటి జయరాం డెడ్ బాడీ… కారు వెనకసీటులో ఉండటం, తలపై రక్తపు మరకలు ఉండటంతో… ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో మొదట దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఘటనాస్థలంతో పాటు హైవేపై ఉన్న టోల్ గేట్లలోని సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. జనవరి 31వ తేదీ రాత్రి 8.30గంటల ప్రాంతంలో పంతంగి టోల్ ప్లాజా.. రాత్రి 10గంటల 22 నిమిషాలకు చిల్లకల్లు టోల్ ప్లాజాలను.. చిగురుపాటి జయరాం కారు క్రాస్ చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆయన డ్రైవ్ చేయట్లేదని గుర్తించిన పోలీసులు… ఇది హత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. జయరాంను ఎక్కడో హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇక్కడ వదిలేసి వెళ్లారని చెప్పారు.

 

బుధవారం(జనవరి 30వ తేదీ) మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన చిగురుపాటి జయరాం.. గురువారం(జనవరి 31వ తేదీ) సాయంత్రం విజయవాడ వస్తున్నానని.. తన సిబ్బందికి మెసేజ్ పెట్టారు. ఆయన విజయవాడ చేరకుండానే మధ్యలో  విగతజీవిగా మారారు. తలపై గాయాలను పరిశీలిస్తే.. ఇది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. మృతుడి చేతులు నలుపు రంగులోకి మారడాన్ని బట్టి విష ప్రయోగం కూడా జరిగినట్లు అనుమానిస్తున్నారు. కారులో నలుగురు ప్రయాణించారని భావిస్తున్న పోలీసులు.. కోస్టల్ బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు.

 

చిగురుపాటి జయరాం.. గతంలో హైదరాబాద్‌లో జెనోటెక్ ఫార్మా కంపెనీతోపాటు ఇతర వ్యాపారాలను నిర్వహించారు. అమెరికాలోనూ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీలను నిర్వహించారు. కొంతకాలంగా ఆయన కంపెనీలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ టీవీ కూడా మూతబడింది. జీతాల చెల్లింపుల విషయమై ఉద్యోగులతో ఆయనకు విభేదాలున్నాయి. భార్య, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముండే జయరాం.. నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అప్పట్నుంచి ఒంటరిగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జయరాం పర్సనల్ డ్రైవర్ మాత్రం…ఆయనకు మద్యంతాగే అలవాటు, రాత్రిపూట ప్రయాణాలు చేసే అలవాటు లేదంటున్నాడు. పథకం ప్రకారమే ఎవరో చంపేశారని చెబుతున్నాడు.

 

కారులో నలుగురు ప్రయాణించారని అనుమానిస్తున్న పోలీసులు.. వారు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. మద్యం బాటిళ్లు ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారనేది కూడా తేలాల్సి ఉంది. ఏ విషయంలో కారులో గొడవ జరిగింది.. వారితో చిగురుపాటి జయరాంకి ఉన్న సాన్నిహిత్యం ఏంటీ అనేది కూడా నిగ్గుతేలాల్సి ఉంది. ఎక్కడ చంపారు.. ఏ విధంగా చంపారు.. చంపినోళ్లు ఎవరు అనేది.. కారును అక్కడ వదిలేసింది ఎవరు అనే విషయాలపై సీరియస్ గా విచారణ చేపట్టారు పోలీసులు.