సైబర్‌ వేధింపులు : ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 03:26 AM IST
సైబర్‌ వేధింపులు : ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైబర్‌ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరుతో ఓ నిందితుడు ఫేస్‌బుక్‌ ఖాతా ప్రారంభించాడు. మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా మరో ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టులు పెడుతున్నారు. వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌ కోసం ఏప్రిల్ 15న ముంబయిలో భారత క్రికెట్‌ జట్టును ఎంపిక చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ సన్నిహితులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరాలను ఆయన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఉన్నతాధికారులకు తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చాక శుక్రవారం (ఏప్రిల్ 19, 2019) పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లే అంశాలున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇతరత్రా పోస్టులు ఉంచకుండా చర్యలు చేపట్టారు.

మరోవైపు ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరును డబ్బుల వసూలుకు కూడా ఉపయోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీ అగ్రనేత వ్యక్తిగత సహాయకుడినంటూ చక్రి అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఫోన్‌ చేశాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో సభ్యుడు నాగరాజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడని, అతడి కిట్‌ కోసం రూ.2.85లక్షలు ఇవ్వాలని కోరాడు. వివరాలు పంపించండి పరిశీలిస్తానంటూ ఎమ్మెస్కే చక్రికి చెప్పారు. చక్రి అంతటితో ఊరుకోకుండా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, ఐపీఎల్‌ ప్రతినిధి రాజీవ్‌ శుక్లా పేర్లతో నకిలీ లేఖలు సృష్టించాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ను మాట్లాడుతున్నానంటూ విశాఖపట్నం నోవాటెల్‌ యజమాని ప్రభు కిషోర్‌, గీతం గ్రూప్‌ విద్యా సంస్థల సంచాలకుడు, తెదేపా తరఫున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌, కోనేరు ప్రసాద్‌, విశాఖపట్నం ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్‌ జి.వెంకటశాస్త్రిలకు ఫోన్‌ చేశాడు. ఆ లేఖలను తీసుకుని మార్చి చివరి వారంలో విశాఖకు వెళ్లాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ తనను పంపించారని వారితో చెప్పాడు. ఒకటి, రెండు రోజుల తర్వాత తాము విరాళం ఇస్తామని వారు చక్రికి చెప్పారు. అనంతరం నలుగురూ ఎమ్మెస్కేకు ఫోన్‌ చేయగా తాను ఎవరికీ ఈ విషయం చెప్పలేదని వివరించారు. అనంతరం ఆయన ఏపీ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా… చక్రి అనే పేరుతో ఈ వ్యవహారం నడిపిన బుడుమూరి నాగరాజ్‌ను పట్టుకున్నారు.

గుంటూరులోనూ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరును ఒక వ్యాపారి పేకాట క్లబ్‌ నిర్వహణ కోసం వినియోగించుకోబోయాడు. పోలీస్‌ ఉన్నతాధికారిని కలిసి తాను, ఎమ్మెస్కే క్లబ్‌ను నిర్వహించనున్నామని వివరించాడు. పోలీస్‌ ఉన్నతాధికారి ఎమ్మెస్కేను ఫోన్‌లో సంప్రదించగా… చట్ట విరుద్ధ కార్యకలాపాలను తాను ప్రోత్సహించబోనని, తనకు పేకాట క్లబ్‌కు ఏమాత్రం సంబధం లేదని వివరించారు.

తన పేరిట ఎలాంటి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలు లేవని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. విరాళాల కోసం ఎవరైనా తన పేరును ప్రస్తావించినా ధ్రువీకరించుకోవాలని ఆయన కోరారు. తాను అలాంటివాటిని ప్రోత్సహించనని ఎమ్మెస్కే వెల్లడించారు.