పుణెలో రూ.87కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 08:56 AM IST
పుణెలో రూ.87కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

పుణెలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. భారీ స్థాయిలో నకిలీ నోట్లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.87కోట్లుగా తేల్చారు. ఇందులో నకిలీ ఇండియన్ కరెన్సీతో పాటు ఫారిన్ కరెన్సీ కూడా ఉంది. దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ఆర్మీలో పని చేసే వ్యక్తి ఉండటం కలకలం రేపుతోంది. మిలటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. ఓ ఆర్మీ అధికారి సాయంతో కొందరు హవాలా మార్గంలో సొమ్మును మార్చే క్రమంలో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో అసలు నోట్లు(ఇండియన్ కరెన్సీ, అమెరికా డాలర్లు) కొన్ని ఉన్నాయి. వాటి విలువ రూ.3లక్షలు. నోట్లన్నీ బంగ్లాలో కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. 

పెద్ద సంఖ్యలో నకిలీ నోట్ల ముద్రణ:
ఎరవాడ సంజయ్ పార్క్ దగ్గర అంతర్జాతీయ నకిలీ నోట్ల రాకెట్ గుట్టును పుణె పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. పుణె ఎయిర్ పోర్టుకి సమీపంలో విమన్ నగర్ లోని ఓ బంగ్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. భారతీయ కరెన్సీకి బదులుగా విదేశీ కరెన్సీని తీసుకోవడానికి ఒక పోలీస్ అధికారిని పంపారు. అలా నకిలీ నోట్ల గ్యాంగ్ ను పట్టుకున్నారు. బంగ్లా నుంచి స్పై కెమెరాలు, రెండు తుపాకులు, కంప్యూటర్, ల్యాప్ టాప్, ప్రింటింగ్ మెషీన్, సెల్ ఫోన్లు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మిలటరీ ఇంటెలిజెన్స్ కు చెందిన సదరన్ కమాండ్ లియాసన్ యూనిట్, పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నకిలీ కరెన్సీలో రూ.2వేలు, రూ.500, వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటి మీద చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. పోలీసులు సీజ్ చేసిన వాటిలో నకిలీ అమెరికా డాలర్లు కూడా ఉన్నాయి. 

కీలక సూత్రధారి ఆర్మీ ఆఫీసర్:
నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న గ్యాంగ్ లో పట్టుబడిన ఆర్మీ అధికారిని గులాబ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. అతడు పుణె ఆర్మీ యూనిట్ లో లాన్స్ నాయక్ ర్యాంక్ హోదాలో పని చేస్తున్నాడు. మిగతా వారిని సునీల్, రితేష్ రత్నాకర్, అహ్మద్, అబ్దుల్ ఘనీ, అబ్దుల్ రెహ్మాన్ గా గుర్తించారు. ఆర్మీ అధికారి గులాబ్ ఖాన్ గత 8 ఏళ్లుగా పుణె యూనిట్ లో పని చేస్తున్నాడు. నకిలీ నోట్ల ముఠాలో కీలక సూత్రధారి ఆర్మీ అధికారే. గ్యాంగ్ లోని మిగతా సభ్యుల్లో ఒకరిది పుణె కాదా, నలుగురిది ముంబై.

Read: 400ల గొర్రెల్ని బలి ఇచ్చి కరోనాకు శాంతి పూజలు