ఆర్పీ పట్నాయక్ ద్వారా వెలుగులోకి ఏయూ ఉద్యోగాల మోసం 

  • Published By: chvmurthy ,Published On : October 18, 2019 / 10:13 AM IST
ఆర్పీ పట్నాయక్ ద్వారా వెలుగులోకి ఏయూ ఉద్యోగాల మోసం 

ఏయూలో  ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు  కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు  ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్  హైదరాబాద్ మణికొండ లో నివాసం ఉంటున్నారు.  అతని ఎదురు ఫ్లాట్ లో దినేష్  అనే వ్యక్తి ఉంటున్నాడు.  ఈక్రమంలో దినేష్ తన తల్లి సత్యను ఏయూలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ మెంట్ అధికారిణిగా పరిచయం చేశాడు.  

ఏయూలో ఉద్యోగాలు తన తల్లే చేపడతారని రాజశేఖర్ ను నమ్మించాడు. రాజశేఖర్ కు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని దినేష్ చెప్పాడు. ఆ క్రమంలో రాజశేఖర్ తో సహా అతని స్నేహితులు, బంధువులు మొత్తం 12 మందికి ఏయూలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు కోటి 7లక్షల రూపాయలు దినేష్ అతని తల్లి వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైనట్లు అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంతకాలతో 2019 జనవరిలో జాబితా ఇచ్చాడు. ఆగస్టు 13న ఉద్యోగాలు వచ్చినట్లు ఏయూ వీసీ పేరుతో బాధితుల మెయిల్ కు ఫేక్ ఏయూ మెయిల్ ఐడీ నుంచి ఆర్డర్ కాపీలు పంపాడు.  

ఇటీవల ఆర్పీ పట్నాయక్ విశాఖ వచ్చారు. అప్పడు వైసీపీ నేత పత్తి దివాకర్ ను కలిశారు. వారిద్దరి మధ్య మాటల సందర్భంలో తన అసిస్టెంట్ కు ఏయూలో ఉద్యోగం వచ్చిన విషయం ఆర్పీ  ప్రస్తావించారు. గొంతిన సత్య తమకు ఉద్యోగాలు ఇప్పించారని కెమెరామెన్ రాజశేఖర్ ఆర్డర్ కాపీలను ఆయనకు చూపించాడు. ఆ వార్తలో నిజం లేదనిపించిన దివాకర్ వెంటనే ఆర్డర్ కాపీలను ఏయూ వీసీ ప్రసాద రెడ్డికి చూపించారు. అవన్నీ బోగస్ అపాయింట్ మెంట్లు అని వీసీ తేల్చి చెప్పారు. దీంతో వీసీ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరో వైపు ఏయూ ఫోర్జరీ నియామకాల్లో కొత్త ట్విస్ట్  వెలుగు చూసింది. గతంలో  నకిలీ పి.హెచ్.డి సెర్టిఫికెట్ లను ఇదే ముఠా సృష్టించి అమ్మకానికి పెట్టినట్లు ఏయూ ఉన్నతాధికారులు గుర్తించారు. హైద్రాబాద్ జె.ఎన్.టి.యూ లో నకిలీ సరిఫికెట్లు పెట్టి గతంలో ఉద్యోగాలు పొందిన వ్యవహారం అప్పట్లో బయటపడటంతో  ఏయూ అధికారులుపోలీసులు కు ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఏయూ నకిలీ అపాయింట్  మెంట్స్ వ్యవహారం కూడా అదే ముఠా చేసినదని అధికారులు గుర్తించారు. ఈవిషయంలో ఏయూ సిబ్బంది ప్రమేయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.