మంటల కలకలం : లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 02:10 AM IST
మంటల కలకలం : లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : బషీర్‌బాగ్‌లోని ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2019, జనవరి 23వ తేదీ బుధవారం ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి.  చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ వ్యాపించడంతో భయపడిన ఉద్యోగులు కిందకు పరుగులు పెట్టారు. 5వ అంతస్తులో ఉన్న వారంతా సురక్షితంగా  బయటపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 14 ఫైరింజన్ల సాయంతో మంటల్ని ఆర్పేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ  భారీ ఆస్తి నష్టం జరిగింది.

 

ఈ భవనంలో 8 అంతస్తులు ఉన్నాయి. బిల్డింగ్‌లోని ట్యాక్స్ కన్సల్టెంట్‌ ఆఫీసులో అగ్రిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. ఈ భవనంలో పలు  కీలక కార్యాలయాలు ఉన్నాయి. కార్పొరేట్‌ స్థాయి కార్యాలయాలు, సెల్‌ఫోన్‌ షోరూమ్స్, కంటి అద్దాల షాపులు, వస్త్ర దుకాణాలు, సెల్‌ఫోన్ల కంపెనీలతోపాటు కాల్‌సెంటర్‌ కార్యాలయాలు ఉన్నాయి.  ఈ భవనంలో 5వ అంతస్తులో అడ్వాంటేజ్‌ వన్‌ కాల్‌ సెంటర్‌ ఉంది. 2వ అంతస్తులో రెండు తెలుగు రాష్ట్రాల ఐడియా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. చాలా మంది నివాసం కూడా ఉంటున్నారు.  మంటల్ని గమనించి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేకపోతే ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

 

భవనంలోని 5, 6, 7 అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని పోలీసులు కాపాడారు. ఈ బిల్డింగ్ ప్రముఖ ఉర్దూ దినపత్రిక అధినేత ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌కు చెందినది.  ఆక్సిజన్‌ సిలిండర్లు తెరుచుకోకపోవడంతో మంటలు మరిన్ని అంతస్తులకు వ్యాపించాయి.