ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

Four killed in a Road Accident at Prakasam District  : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టురుకు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని వెంకట విజయ లక్ష్మి, ఆర్.కనకమహాలక్ష్మి, బలిజ సత్యన్నారాయణ, హైదరాబాద్‌లోని కూకట్‌ల్లికి చెందిన ఉయ్యూరు చినబాబు, సందీప్‌ లతోపాటు మరో వ్యక్తి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

దర్శనానంతరం కారులో ఊరికి తిరిగి పయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున వారుప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.