మహిళలే వారి టార్గెట్‌…పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.12.5లక్షలు కాజేసిన విదేశీముఠా

ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్‌, నేపాలీల ముఠా కాజేసింది.

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 03:29 AM IST
మహిళలే వారి టార్గెట్‌…పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.12.5లక్షలు కాజేసిన విదేశీముఠా

ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్‌, నేపాలీల ముఠా కాజేసింది.

డైవర్సీ మ్యాట్రిమోనిలో దరఖాస్తు చేసుకున్న మహిళలే వారి టార్గెట్‌..పెండ్లి చేసుకుంటామని..ముందుగా గిఫ్ట్‌గా డైమండ్‌, డాలర్లు, ఆభరణాలు పంపిస్తున్నామని నమ్మిస్తారు… ఆ తర్వాత కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌చేసి .. వివిధ ట్యాక్స్‌ పేరుతో డబ్బులు కాజేస్తారు. ఇలా ఓ వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్‌, నేపాలీల ముఠా కాజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆ ముఠాను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. 

ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు
ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ మ్యారేజ్‌ బ్యూరోలో వివరాలు నమోదు చేసిన మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడింది. వివరాలు నమోదు చేసుకున్న మహిళలతో.. పెళ్లి చేసుకుంటామంటూ, బహుమతులు పంపించామంటూ నలుగురు సభ్యుల ముఠా, మహిళల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. తర్వాత, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్‌లైన్‌ వివరాల ఆధారంగా దర్యాప్తు చేసి, ఎట్టకేలకు మోసాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేశారు. 

వివాహం కోసం డైవర్సీ మ్యాట్రిమోనిలో వైద్యురాలు ప్రొఫైల్‌ దరఖాస్తు 
బుధవారం (మార్చి 11, 2020) గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. ముంబైకి చెందిన వైద్యురాలు సైబరాబాద్‌ పరిధిలోని నలగండ్లలో నివాసం ఉంటుంది. ఆమె వివాహం కోసం డైవర్సీ మ్యాట్రిమోనిలో తన ప్రొఫైల్‌ను దరఖాస్తు చేసుకుంది. దీన్ని చూసి లండన్‌లో అర్థోపెడిక్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నానంటూ విపుల్‌ ప్రకాష్‌ అనే నైజీరియన్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. మీ ప్రొఫైల్‌ నచ్చింది .. మిమ్మల్ని పెండ్లి చేసుకుని భారతదేశంలో స్థిరపడతానని నమ్మించాడు. దీంతో ఇద్దరు వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకుని.. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నారు. 

పెండ్లి కానుకగా ముందు గిఫ్ట్‌ పార్శిల్‌ 
ఈ క్రమంలో విపుల్‌ ప్రకాశ్‌… పెండ్లి కానుకగా ముందు మీకు ఓ గిఫ్ట్‌ పార్శిల్‌ పంపిస్తున్నానని.. అందులో ఖరీదైన ఆభరణాలు, డాలర్లు ఉన్నాయంటూ వైద్యురాలికి చెప్పా డు. మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి.. మీకు వచ్చిన పార్శిల్‌కు సంబంధించి ట్యాక్స్‌లు కట్టాలని … లేదంటే గిఫ్ట్‌ రాదని చెప్పాడు. దీంతో వైద్యురాలు అతను సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.7.45లక్షలు డిపాజిట్‌ చేసింది. ఆ తర్వాత గిఫ్ట్‌ ప్యాక్‌ రాకపోవడంతో.. మోసం అని గ్రహించి ఫిబ్రవరి 4న బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలికి మరో పార్శిల్‌ 
అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. ఫిబ్రవరి 15న వైద్యురాలికి ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ మరుసటి రోజు విపుల్‌ ప్రకాశ్‌ ఫోన్‌ చేసి.. ఆ లాకర్‌ కీ తెరవాలంటే రూ.5లక్షలు తాను సూచించిన కస్టమ్స్‌ అధికారుల ఖాతాలో జమ చేయాలని కోరాడు. ఇది నిజమని నమ్మి.. మరో రూ.5 లక్షలు జమ చేసింది. అయినా నంబర్‌ చెప్పకపోవడంతో వైద్యురాలు.. లాకర్‌ను పగలగొట్టి చూడగా… అందులో నల్లని రంగు పూసిన కాగితాలు కనపడ్డాయి. వెంటనే ఆమె విపుల్‌ ప్రకాశ్‌కు ఫోన్‌ చేయగా… వాటిని బ్లాక్‌ కరెన్సీ అంటారని… నేరుగా పంపిస్తే ఇక్కడి బ్రిటీష్‌ ప్రభుత్వం ఒప్పుకోదని… అలాగే మీకు 40 శాతం ట్యాక్స్‌ పడుతుందని విపుల్‌ ప్రకాశ్‌ వివరించాడు. అయితే ఈ బ్లాక్‌ కరెన్సీని డాలర్‌గా మార్చాలంటే … మరో రూ.22 లక్షలు చెల్లిస్తే ఓ రసాయనాన్ని పంపిస్తానని చెప్పాడు. దీంతో మోసపోతున్నానని గ్రహించిన వైద్యురాలు ఫిబ్రవరి 26న సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్ లో రెండోసారి ఫిర్యాదు చేసింది. 

మోసగించిన వారిలో అందరూ విదేశీయులే
బ్యాంకు ఖాతాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. ఈ మోసం ఢిల్లీలో హౌస్‌కౌస్‌ గ్రామంలోని మూన్‌ షైన్‌ హోటల్‌లో జరిగినట్లు నిర్థారించారు. అక్కడ మాటు వేసిన సైబర్‌ క్రైం పోలీసులు వైద్యురాలికి కొరియర్‌ తెచ్చిన వ్యక్తి గిడ్డి ఇసాక్‌ (నైజీరియన్‌), నేపాల్‌కు చెందిన శర్మ సాగర్‌, సుదీప్‌ గిరి, బికాస్‌ బాల్మికీలను పట్టుకున్నారు. విచారణలో ఈ చీటిం గ్‌ సూత్రధారి ఎసెలు ఉడో(నైజీరియన్‌) అలియాస్‌ డాక్టర్‌ విపుల్‌ ప్రకాశ్‌గా తేలింది. అతను పరారీలో ఉన్నాడు.

బిజినెస్‌ వీసాపై భారత్ కు నైజీరియన్‌లు 
ఈ నైజీరియన్‌లు 2018లో భారత దేశానికి బిజినెస్‌ వీసా మీద వచ్చారు. నేపాలీలు 2014లో ఢిల్లీకి వచ్చి మూన్‌షైన్‌ హోటల్‌లో పని చేస్తున్నారు. అయితే నైజీరియన్‌లు తరచూ ఈ హోటల్‌కు వస్తుండగా సుదీప్‌ గిరి ద్వారా మరో ఇద్దరు నేపాలీలను వారు పరిచయం చేసుకుని.. వారి పేరుమీదనే బ్యాంకు ఖాతాలు తెరిచారు. నేపాలీలు డబ్బులు డ్రా చేసి నైజీరియన్‌లకు ఇస్తుండేవారు.  ఈ ముఠా ఇదే తరహాలో బెంగళూరులో ఇద్దరు బాధితులను మోసం చేసి దాదాపు రూ.40 లక్షలు కొట్టేశారని వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న ఎసెలు ఉడో కోసం సైబరాబాద్‌ పోలీసులు గాలిస్తున్నారు.

సీసీ కెమెరా క్లూతోనే దొరికిన దొంగలు
సైబరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ నేతృత్వంలోని రామయ్య బృందం కేసు దర్యాప్తులో భాగంగా  ఢిల్లీలో 9 రోజుల మాటు వేశారు. అంతకముందు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నించగా అన్ని కాల్స్‌, చాటింగ్‌ మొత్తం వాట్సాప్‌లో ఉండడంతో కొంత కష్టమైంది. అయితే కొరియర్‌ తెచ్చిన వ్యక్తి గురించి సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా.. ఓ దృశ్యం దొరికింది. దాని ఆధారంగా మ్యాపింగ్‌ చేస్తే అతని ఫొటో శంషాబాద్‌ విమానాశ్రయంలో దొరికింది. అలా ఆరా తీసుకుంటూ పోతే సైబర్‌ దొంగలు దొరికిపోయారు. ఈ విధంగా సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు చేసిన దర్యాప్తును సీపీ సజ్జనార్‌ అభినందించారు. నిందితుల ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 లక్షల నగదును ఫ్రీజ్‌ చేయడంతో పాటు వారు పంపిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, బ్యాంకు పాస్‌బుక్‌లను రికవరీ చేశారు.
 

See Also | సౌదీలో వలస కార్మికుడిపై వివక్ష : హ్యుమన్ హ్యాండ్ శానిటైజర్ ధరించిన ఫొటో వైరల్!