దిశ హత్యాచార నిందితుల అంత్యక్రియలు 

  • Published By: chvmurthy ,Published On : December 23, 2019 / 10:26 AM IST
దిశ హత్యాచార నిందితుల అంత్యక్రియలు 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ వైద్యుల బృందంతోపాటు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెం కూడా  పోస్టుమార్టంలో పాల్గో్న్నారు.  ఉదయం9 గంటలకు ఫ్రారంభమైన ప్రక్రియ దాదాపు 4 గంటలపాటు కొనసాగింది.

గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం ఇప్పుడు రీ పోస్టుమార్టం జరిపామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని…. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు.

ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్‌ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డ్ చేసామని…సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా వైద్యులు హైకోర్టుకు నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు.

పోస్టుమార్టం అనంతరం నాలుగు మృతదేహాలను పోలీసులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకుని పోలీసులు మృతదేహాలను వారికి అప్పగించారు. రెండు అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు మృతదేహాల తరలింవెళ్లాయి. ఎట్టిపరిస్ధితుల్లోనూ  ఈ రోజు రాత్రిలోగా  మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో పోస్టుమార్టం చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా రీపోస్టుమార్టం నిర్వహించినట్లు డాక్టర్. శ్రవణ్‌ తెలిపారు. ఈ ప్రక్రియను ఎయిమ్స్‌ బృందం వీడియో చిత్రీకరణ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు… ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌… అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రీ పోస్టుమార్టం కీలకంగా మారింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో భద్రపరిచిన మృతదేహాలను ఈ నెల 9వ తేదీన హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వైద్యులు చర్యలు తీసుకున్నారు.

దిశ హత్యాచార సంఘటనలో నిందితులైన నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌, గుడిగండ్లకు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులు 2019,డిసెంబర్‌ 6న ఛటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే.

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఎన్ కౌంటర్ జరిగిన రోజునే మృతదేహాలకు పోస్ట్‌మార్టం   నిర్వహించి కుటుంబీకులకు అప్పగిస్తారని భావించినా, ఎన్‌కౌంటర్‌పై సందేహాలున్నాయంటూ హైకోర్టులో మహిళా సంఘాల నేతలు పిటిషన్‌ వేయటం…ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు నమోదవడం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ జరపడం, హైకోర్టులోని కేసులన్నింటిపైనా సుప్రీం స్టే విధించడం, ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటవడం వంటి పరిణామాల నేపథ్యంలో మృతదేహాలను  చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నిందితులు చనిపోయి 17 రోజులవుతున్నా అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితిని కుటుంబీకులు ఒకపక్క ఎదుర్కొంటుంటే, మృతదేహాలు చెడిపోతుండడంతో సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది. ఇప్పటికే కుళ్లిపోయిన స్ధితికి చేరుకున్న మృతదేహాలకు  సోమవారంరాత్రిలోగా అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.