గ్యాంగ్ స్టర్ దూబేకు ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీస్

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 09:59 AM IST
గ్యాంగ్ స్టర్ దూబేకు ముందుగానే సమాచారం ఇచ్చిన పోలీస్

పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్‌స్టర్ అంత ప్లాన్డ్‌గా ఎలా కాల్పులు జరిపాడన్న అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు తన కోసం వస్తున్నారన్న సమాచారం ఆ నేరస్థుడికి ముందే ఎలా తెలిసింది? పోలీసుల మృతికి పోలీసే కారణమా? పోలీస్ వర్గాలే అతన్ని అలర్ట్ చేశాయా? అంటే అవుననే చెబుతున్నాయి యూపీ పోలీస్ వర్గాలు.

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ సహా 8మంది పోలుసులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దూబే అనుచరులను కొందరినీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాల్పుల ఘటనకు సంబంధించి 500 మొబైల్ ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరించారు.

ఈ కాల్‌ లిస్ట్‌లో ముగ్గురు పోలీసుల పేర్లు ఉండడం కలకలం రేపింది. ఈ కేసులో చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి వినయ్‌ తివారీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. దూబేను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతి ప్రకటించారు. బిక్రులోని దూబే ఇంటిని పోలీసులు కూల్చివేశారు. రెండు కార్లను, జేసీబీని కూడా ధ్వంసం చేశారు.

కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబేపై చౌబేపూర్‌ స్టేషన్‌లో ఓ వ్యక్తి హత్యాయత్నం కేసు పెట్టాడు. దీంతో స్టేషన్ అధికారి వినయ్ తివారీ సహా నలుగురు సిబ్బంది బిక్రులోని దూబే నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో దూబే ముఠా పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచి వెనుదిరిగిన పోలీసులు.. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దూబేను అరెస్ట్ చేసేందుకు అదనపు బలగాలతో డీఎస్పీ అర్థరాత్రి దూబే నివాసానికి వెళ్లారు.

అయితే దాడి గురించి ముందే సమాచారం అందుకున్న దూబే, అతడి అనుచరులు.. తాము ఉంటున్న ప్రాంతానికి పోలీసులు రాకుండా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. అడ్డంగా జేసీబీ యంత్రాలు పెట్టి రోడ్డును దిగ్బంధించారు. దీంతో పొలిమేరలోనే వాహనాలను ఆపిన పోలీసులు వాటిల్లోంచి కిందకు దిగారు. అప్పటికే మాటువేసిన దూబే, అతడి బృందం.. వాహనాల్లోంచి దిగిన పోలీసులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 8మందిని పొట్టనపెట్టుకున్న దూబే గ్యాంగ్.. పోలీసుల ఆయుధాలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.

8మంది పోలీసులను దారుణంగా చంపిన వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ చేయాలని అతని తల్లి కోరారు. అతను చేసింది పెద్ద నేరమే.. చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. ఒకవేళ పోలీసులకు ప్రాణాలతో పట్టుబడినా కాల్చి చంపేయాలని ఆమె చెప్పారు.