FIR Against Twitter : ట్విట్టర్ కు షాక్, “మధ్యవర్తిత్వ” హోదా కోల్పోయింది

కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం ముదురుతూనే ఉంది.   ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై  తొలి కేసు నమోదైంది. 

FIR Against Twitter : ట్విట్టర్ కు షాక్, “మధ్యవర్తిత్వ” హోదా కోల్పోయింది

Fir Against Twitter

FIR against Twitter  : కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కు మధ్య వివాదం రాను,రాను ముదురుతూనే ఉంది. దేశంలో తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అమలు చేయాల్సిందేనని కేంద్రం, భావ ప్రకటనా స్వేఛ్ఛను హరించవద్దని ట్విట్టర్ పట్టుబట్టి కూర్చోవటంతో విషయం కోర్టుల దాకా వెళ్లింది. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కేంద్రం మధ్యవర్తిత్వ హోదా ఎత్తివేసిందని ప్రకటించగానే ట్విట్టర్ పై తొలికేసు నమోదవడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ట్విట్టర్ పై  తొలి కేసు నమోదైంది.  సామాజిక మాధ్య‌మాల్లో డిజిట‌ల్ కంటెంట్ పై నియంత్ర‌ణ‌కు గానూ కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. 50ల‌క్ష‌లు దాటిన‌ సామాజిక మాధ్య‌మాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడ‌ల్ అధికారిని, అనుసంధాన‌క‌ర్త‌గా మ‌రో ప్ర‌ధాన అధికారిని నియ‌మించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భార‌త్‌లో నివ‌సిస్తూ ఉండాలి.

ఇత‌ర సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఈ నిబంధ‌న‌లు పాటించినప్ప‌టికి ట్విట్ట‌ర్ మాత్రం దీనిని పాటించ‌లేదు. తాజాగా ట్విట్టర్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈనెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్యానెల్ ఎదుట హాజరు కావాలని ట్విట్టర్ ను ఆదేశించింది. జిటల్‌ వేదికలపై పౌరుల హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, ఆన్‌లైన్‌ వార్తలు దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.

ట్విట్టర్‌పై తొలి కేసు వివరాలు
థ‌ర్డ్ పార్టీ కంటెంట్ క‌లిగి ఉన్న‌దంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ట్విట‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ నెల 5న ఓ ముస్లిం వ్య‌క్తిపై కొందరు యువకులు దాడి చేసిన ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేప‌ట్టిన ఘ‌జియాబాద్ పోలీసులు ట్విట‌ర్‌, కొంద‌రు జర్న‌లిస్టుల‌ు, కొందరు రాజకీయ నాయకులపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 153, 153ఏ,295 ఏ,505,120బి, 34 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్ల‌డించారు.