రూ.20 వేలు ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం…..ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

రూ.20 వేలు ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం…..ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

GHMC Superintendent demands bribe as a reward for sanctioning funeral money, trapped ACB Officials : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు శవాలమీద పైసలు ఏరుకుంటారనే నానుడి నిజం చేశాడు జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సూపరింటెండెంట్ వడ్త్యా పూల్ సింగ్.

జీహెచ్ఎంసీలో పనిచేసి  చనిపోయిన కార్మికుడి  భార్య మరణిస్తే ఆమెకు అంత్యక్రియలకు జీహెచ్ఎంసీ డబ్బులు ఇస్తుంది. ఆడబ్బులు ఇవ్వటానికి కూడా రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పూల్ సింగ్. వివరాల ప్రకారం మూసారాంబాగ్  బ్యాండు బస్తీలో నివసించే అనుముల ఆశయ్య పాతబస్తీ, సర్దార్ మహాల్ లోని జీహెచ్ఎంసీలో కామాటిగా పని చేసేవాడు.

పదవీ విరమణ అనంతరం 2013లో చనిపోయాడు. అనంతరం అతని భార్యకు ఫించన్ వచ్చేది. గతేడాది మే 15న ఆమె కూడా చనిపోయింది. కుమారులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే తన తల్లి అంత్యక్రియలకు జీహెచ్ఎంసీ రూ. 20 వేలు ఇస్తుందనే విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు క్రాంతికుమార్  చాంద్రాయణగుట్ట నర్కిపూల్ బాగ్ లోని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ కార్యాలయానికి వచ్చి సర్కిల్ 10 ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ పూల్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందచేసాడు.

వచ్చే సొమ్ములో సగం లంచంగా ఇవ్వాలని పూల్ సింగ్ డిమాండ్ చేశాడు.  చివరికి రూ.5వేలకు ఒప్పందం కుదిరింది. సంబంధిత దరఖాస్తును క్రాంతికుమార్  పూర్తి చేసి పంపిన కొద్దిరోజులకే, రూ.20 వేల చెక్కు వచ్చి తీసుకు వెళ్లమని పూల్  సింగ్ ప్పాడు. ఈ లోపు పూల్ సింగ్ రోజు ఫోన్ చేసి రూ.5వేల ఇవ్వాలని ఒత్తిడి చేయసాగాడు.

దీంతో క్రాంతి కుమార్ ఈ విషయం ఏసీబీ అధికారులకు చెప్పి ఈనెల 17 న కార్యాలయానికి వచ్చాడు. అధికారుల సూచనతో వారు ఇచ్చిన నోట్లు రూ.5వేలు పూల్ సింగ్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచాలు అడిగితే 1064 కు తెలియ చేయమని ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. అనంతరం పూల్ సింగ్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.