లోక్‌సభ ఎన్నికలు : భారీగా పట్టుబడుతున్న నగదు

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 05:31 AM IST
లోక్‌సభ ఎన్నికలు : భారీగా పట్టుబడుతున్న నగదు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా నోట్లకట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారు.  హవాలా రూపంలో నగదు మార్పిడీకి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. దీంతో అభ్యర్థులు హైదరాబాద్ నుంచి డబ్బు తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఆయా పార్టీల నేతలు తమకు అవసరమైన డబ్బులో అత్యధికం హైదరాబాద్‌ కేంద్రంగానే తరలిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు ప్రధాన అనుచరులు పార్టీ శ్రేణులు గ్రేటర్ శివారు ప్రాంతాల కేంద్రంగా డబ్బును ఏపీకి తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో వాణిజ్య, వ్యాపార సంస్థలు అత్యధికంగా ఉండడంతో హవాలా రూపంలో నగదు నగరందాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలో నగదును తరలిస్తూ నేతలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.  ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో సుమారు 16 కోట్ల రూపాయలు సీజ్‌ చేశారు.
 
సరిగ్గా నాలుగు రోజుల కిందట రాజేంద్రనగర్‌ పోలీసులు 24 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి టీడీపీ తరపున పోటీ చేస్తోన్న పరిటాల శ్రీరామ్‌కు  చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. ఇక హబ్సిగూడ ప్రాంతంలో పోలీసులు 49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తోన్న రేవంత్‌రెడ్డికి చెందిన నగదుగా పోలీసుల దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 

ఇక మొన్న మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో రెండు కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఇది రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తోన్న మురళీమోహన్‌కు చెందిన నగదుగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అమీర్‌ పేట ధరమ్‌కరమ్‌ రోడ్‌లో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న  29 లక్షల 84వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక బంజారాహిల్స్‌లో పోలీసులు వాహన తనిఖీల్లో  మరో 3 కోట్ల 20 లక్షల నగదు పట్టుబడింది. 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న కొందరు హవాలా వ్యాపారులను టీడీపీ వాడుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు నగదు సరఫరాల్లో కీలక దళారులుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాపకింద నీరులా సాగుతున్న పచ్చనోట్ల కథకు బ్రేక్‌వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు.