హేమంత్ పరువు హత్య కేసులో మలుపులు.. తెరపైకి మరో ఇద్దరి పేర్లు, ఇప్పటివరకు దొరకని ఫోన్

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 11:33 AM IST
హేమంత్ పరువు హత్య కేసులో మలుపులు.. తెరపైకి మరో ఇద్దరి పేర్లు, ఇప్పటివరకు దొరకని ఫోన్

hemanth honour killing…పరువు హత్యకు గురైన.. హేమంత్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి, మరో బంధువు సందీప్‌ రెడ్డి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసులో హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.




గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. మరోవైపు సంఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు హేమంత్‌ మొబైల్‌ ఫోన్‌ లభ్యం కాలేదు. పోలీసులు దానిని సేకరించే పనిలో పడ్డారు.

ప్రేమ పెళ్లే శాపమైంది:
ప్రేమ పెళ్లే హేమంత్‌ పాలిట శాపమైంది. అవంతిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదంటూ.. హేమంత్‌ చెప్పిన మాటలే.. అతన్ని చంపేశాయి. ఎలాగైనా హేమంత్‌ అడ్డు తొలగించాలని భావించారు అవంతి తల్లిదండ్రులు. పగబట్టి మరీ హేమంత్‌ను చంపేశారు. ప్రాణాల కంటే.. పరువే ముఖ్యమని ఓ నిండు జీవితాన్ని మధ్యలోనే చిదిమేశారు. కన్నబిడ్డ మీద ప్రేమ ఉందంటూనే.. ఆమె జీవితాన్ని మోడు చేశారు. ప్రేమ పెళ్లికి ఆస్తి, కులం అడ్డు రావడంతో.. పరువు హత్యకు దారి తీశారు లక్ష్మారెడ్డి అండ్‌ బ్యాచ్‌.




హేమంత్‌ మర్డర్‌కు ముందు నుంచే ప్లాన్‌:
తన కూతురు అవంతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు.. హేమంత్‌ను అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, అతని బంధువులు పగబట్టి మరీ.. చంపేసినట్లు తెలుస్తోంది. హేమంత్‌ను ఎలాగైనా అడ్డు తప్పించేందుకు.. ముందు నుంచే మర్డర్‌ ప్లాన్‌ వేశారు అవంతి తల్లిదండ్రులు. అయితే.. తాజాగా ఓ ఆడియో క్లిప్‌ 10టీవీ చేతికి చిక్కింది. హేమంత్‌ ఆచూకీ కోసం.. అతని తండ్రికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు లక్ష్మారెడ్డి బంధువులు. తాగిన మత్తులో.. అర్థరాత్రి వేళ హేమంత్‌ తండ్రికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. తనకు హేమంత్‌ అప్పు ఉన్నాడని.. హేమంత్‌ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్లు ఇవ్వాలంటూ హేమంత్ తండ్రిని బెదిరించారు.

హేమంత్ ను చంపేందుకు రూ.10లక్షలు సుపారీ:
హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసుల దర్యాప్తుతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారమే.. హేమంత్‌ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హేమంత్ హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. హేమంత్‌ని చంపేందుకు లక్ష్మారెడ్డి, యుగంధర్ పక్కాగా ప్లాన్ చేశారు. హత్యకు నెలరోజుల ముందే గచ్చిబౌలిలో యుగంధర్ సోదరులు రెక్కి నిర్వహించారు. కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాతో యుగంధర్‌ మాట్లాడాడు. హేమంత్‌ను చంపేందుకు పది లక్షల సుపారీ ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. లక్ష అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత ఇంటిల్లిపాదీ కలిసి.. హేమంత్‌ను కసితీరా చంపేశారు.




చెల్లెలు, బావ కళ్లలో ఆనందం చూడటానికి.. మరో కులం వ్యక్తిని చేసుకుందని రగిలిపోయారు, పరువు పోయిందని హేమంత్ దారుణ హత్య:

హైదరాబాద్ చందానగర్ తారానగర్‌కు చెందిన అవంతి రెడ్డి బీటెక్‌ చేసింది. హేమంత్‌ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్‌ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్‌ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు రోజే అంటే జూన్ 10న అవంతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెళ్లైన వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించారు.

అవంతి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడంతో.. వారి పేరెంట్స్ లక్ష్మారెడ్డి, అర్చన అవమానంగా భావించారు. కూతురు చేసిన పనికి పరువు పోయిందంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. అవమానంతో రగిలిపోయారు. ఈ బాధను బావమరిది యుగంధర్‌రెడ్డి దగ్గర షేర్ చేసుకున్నారు. తమ కూతురుని ఎలాగైనా తమ దగ్గరకు తిరిగి తెచ్చుకోవాలని భావించారు. దీంతో.. యుగంధర్‌రెడ్డి చెల్లెలు, బావ కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు.




ఇదే విషయంపై నెల రోజుల కిందటే.. అర్చన, లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేశారు. ఎలాగైనా హేమంత్‌ను చంపేస్తే.. అవంతి తమ వద్దకు తిరిగి వస్తుందనుకున్నారు. ప్లాన్ వేసిన వెంటనే బావమరిది యుగంధర్‌కు బాధ్యతలు అప్పగించాడు లక్ష్మారెడ్డి. 10 లక్షలు ఖర్చు పెట్టేందుకూ రెడీ అన్నాడు. దీంతో తనకు తెలిసిన మాజీ నేరస్తులు ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా, బిక్షూ యాదవ్‌లను సంప్రదించాడు యుగంధర్‌. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చారు.