చెల్లి, బావ కళ్లలో ఆనందం చూడటానికి.. నెల క్రితమే హేమంత్ హత్యకు ప్లాన్ చేసిన అవంతి మేనమామ, పరువు కోసం దారుణం

  • Published By: naveen ,Published On : September 28, 2020 / 11:50 AM IST
చెల్లి, బావ కళ్లలో ఆనందం చూడటానికి.. నెల క్రితమే హేమంత్ హత్యకు ప్లాన్ చేసిన అవంతి మేనమామ, పరువు కోసం దారుణం

hemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్‌కు చెందిన అవంతి రెడ్డి బీటెక్‌ చేసింది. హేమంత్‌ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్‌ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్‌ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు రోజే అంటే జూన్ 10న అవంతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెళ్లైన వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించారు.

చెల్లి, బావ బాధను తట్టుకోలేకపోయిన యుగంధర్ రెడ్డి:
అవంతి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడంతో.. వారి పేరెంట్స్ లక్ష్మారెడ్డి, అర్చన అవమానంగా భావించారు. కూతురు చేసిన పనికి పరువు పోయిందంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. అవమానంతో రగిలిపోయారు. ఈ బాధను బావమరిది యుగంధర్‌రెడ్డి దగ్గర షేర్ చేసుకున్నారు. తమ కూతురుని ఎలాగైనా తమ దగ్గరకు తిరిగి తెచ్చుకోవాలని భావించారు. దీంతో.. యుగంధర్‌రెడ్డి చెల్లెలు, బావ కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు.



నెలక్రితమే హేమంత్ మర్డర్ కు ప్లాన్:
ఇదే విషయంపై నెల రోజుల కిందటే.. అర్చన, లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేశారు. ఎలాగైనా హేమంత్‌ను చంపేస్తే.. అవంతి తమ వద్దకు తిరిగి వస్తుందనుకున్నారు. ప్లాన్ వేసిన వెంటనే బావమరిది యుగంధర్‌కు బాధ్యతలు అప్పగించాడు లక్ష్మారెడ్డి. 10 లక్షలు ఖర్చు పెట్టేందుకూ రెడీ అన్నాడు. దీంతో తనకు తెలిసిన మాజీ నేరస్తులు ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా, బిక్షూ యాదవ్‌లను సంప్రదించాడు యుగంధర్‌. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చారు.

అవంతి బతికిపోయింది, హేమంత్ దొరికిపోయాడు:
హేమంత్, అవంతి ఉంటున్న గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హేమంత్ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. అవంతి బంధువులు, కిరాయి గూండాలంతా కలిసి వాళ్లిద్దరినీ బెదిరించారు. హేమంత్‌, అవంతిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లి వైపు తీసుకెళ్లారు. గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్‌ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అవంతి కారులో నుంచి దూకేసింది. కానీ.. హేమంత్‌ దొరికిపోయాడు. తర్వాత కారును జహీరాబాద్ వైపు తీసుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెం దగ్గర రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఉరేసి నిందితులు చంపేశారు.



ఒక్క అరగంట ఆలస్యం:
ఒక్క అరగంట ఆలస్యం.. తమ జీవితాలను ఇలా మార్చేసిందని హేమంత్‌ భార్య అవంతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనతో మాట్లాడతామంటూ తన మేనమామ బంధువులు గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని తమ ఇంటికొచ్చారని.. వారు అరగంట ఆలస్యంగా వచ్చుంటే తన భర్త బతికేవాడంటూ కన్నీరు పెట్టుకుంది. వచ్చే జనవరిలో తామిద్దరం లండన్‌ వెళ్లాలనుకున్నామని.. తన బీటెక్‌ ఉత్తీర్ణత ధ్రువపత్రాల కోసం గీతం యూనివర్సిటికీ వెళ్లాలని గురువారం ఉదయమే అనుకున్నామని అవంతి చెప్పింది.

హేమంత్‌ను బెదిరించి ఎక్కడైనా వదిలేస్తారనుకున్నా:
యూనివర్సిటీకి బయలుదేరాలనుకునేలోపు వస్తున్నామంటూ.. తన బంధువు రజిత ఫోన్‌ చేసిందని.. ఆమె మాటలు నమ్మి యూనివర్సిటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయామంది అవంతి. కొద్దిసేపటికే తాము ఉంటున్న ఇంట్లోకి పది మందికిపైగా వ్యక్తులు దూసుకొచ్చారని.. ఇద్దరినీ ఎత్తుకెళ్లారని విలపించింది. మార్గమధ్యలో తాను కారులోంచి దూకేశాక తనను వదిలేశారని.. హేమంత్‌ను బెదిరించి ఎక్కడైనా వదిలేస్తారనుకున్నా.. కానీ ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమైంది.



హేమంత్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన ఏ ఒక్కరినీ వదలొద్దంటోంది అవంతి. తన కన్న తల్లిదండ్రులే ఇంతటి దారుణానికి ఒడిగడతారని ఊహించలేదంది. అమాయకుడైన తన భర్తను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే తన ప్రేమను వదులుకొనైనా.. హేమంత్‌ను కాపాడుకునేదాన్నని చెబుతోంది.

అవంతిని వదిలేయటానికి ఒప్పుకోకపోవడంతోనే హత్య:
ఈ క్రైమ్ సీన్‌లో ఎక్కడా కన్పించకుండా అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడ్డారు. హేమంత్‌ కిడ్నాప్‌ సమయంలో బైక్‌పై అక్కడకు వచ్చిన లక్ష్మారెడ్డి ఎవరికంటా పడకుండా జరిగే తతంగాన్ని కళ్లారా చూశాడు. ఇక అర్చన అయితే కూతురిపై ప్రేమ అంటూ పగతో రగిలిపోయింది. తన కన్నబిడ్డను తెచ్చుకోవడానికి మరో తల్లి కన్నపేగును తెంచేసింది. ప్రేమించి పెళ్లాడిన వాడిని కళ్లముందే చంపేస్తే తన కూతురు ఇంటికి తిరిగి ఇంటికెలా వస్తుందనే లాజిక్‌ను మాత్రం మిస్సైంది. కూతురి పసుపు కుంకుమలు చెరిపేసి ఇప్పుడు జైలు పాలైంది.



అవంతిని వదిలేయమని ఎంత చెప్పినా.. వినకపోవడంతోనే హేమంత్‌ని చంపేశామని చెప్పాడు ఏ1 నిందితుడు యుగంధర్ రెడ్డి. హత్య చేయటానికి ముందు.. కారులో కూడా చాలా సేపు నచ్చజెప్పానన్నాడు. హేమంత్.. అవంతని వదిలేయటానికి ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసినట్లు తెలిపాడు. ఇక.. హేమంత్ హత్య కేసులో మొత్తం 16 మంది నిందితులను తేల్చారు. అందులో 14 మందిని అరెస్ట్ చేశారు గచ్చిబౌలి పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.