కరక్కాయ అమ్మ స్కామ్ : పల్లీ నూనె పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారు  

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 05:09 AM IST
కరక్కాయ అమ్మ స్కామ్ : పల్లీ నూనె పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారు                

హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్‌ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో రూ.కోట్లలో కొట్టేసిన ఘరానా మోసం బైటపడింది. ప్రతి నెలా రూ.5 వేలు చెల్లిస్తే.. రెండు సంవత్సరాల్లో రూ.20 లక్షలు ఇస్తామంటూ రంగంలోకి దిగారు మోసాల రాయుళ్లు. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.10 వేలు సంపాదించుకోవచ్చంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు.
 

గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో కంపెనీ :

‘గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించారు. చేసే పని ఏంటో తెలుసా పల్లీ నూనె తీయటం. పల్లీలు, అందుకు మిషన్ కంపెనీనే ఇచ్చింది. పల్లీల నుంచి నూనె తీసి కంపెనీకి ఇవ్వాలి. నూనెతోపాటు పిప్పి కూడా కొనుగోలు చేస్తాం అని ప్రకటనలు ఇచ్చారు. కిలో నూనెకి రూ.100, పిప్పికి మరో 50 ఇస్తాం అని చెప్పారు. సగానికి సగం లాభం ఉంటుందని నమ్మించారు. లక్ష పెట్టుబడితో ఏడాదిలో రెండు లక్షల రూపాయలు సంపాదించొచ్చని ఆశపెట్టారు. 2 లక్షల పెడితే రెండేళ్లలో నాలుగు లక్షలు మీ సొంతం అవుతాయని ప్రకటనలు ఇచ్చారు. అంతే కాదు స్కీమ్ లో మరొకరిని చేర్పిస్తే 20 వేల రూపాయలు కమీషన్ ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. దీన్ని నమ్మిన ప్రజలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. కస్లమర్లను నమ్మించటానికి బాండ్ పేపర్లపై అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు. 
 

నాలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల స్కామ్ :

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రంలో 6వేల మంది ఈ స్కీమ్ లో జాయిన్ అయినట్లు సమాచారం. 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు సవ్యంగా సాగింది వ్యాపారం. ఆ తర్వాతే డబ్బులు చెల్లించటం నిలిపివేశారు. 2, 3 నెలలుగా సరిగా డబ్బులు చెల్లించకపోవటంతో బాధితులు నిలదీశారు. కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండటంతో.. రాత్రికి రాత్రి కంపెనీ బోర్డు తిప్పేసింది. 

బాండు పేపర్లపై అగ్రిమెంట్లు..బహుమతులు
సికింద్రాబాద్ లో ఉండే ఈ గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ ఆఫీస్.. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఉంది. ఆఫీస్ సమీపంలోనే పెద్ద గోదాం. పల్లీలు, నూనె, పిప్పి, మిషన్స్ స్టాక్ చేస్తున్నారు. రూ.5 వేలు చెల్లించి ఇతరులను చేర్పిస్తే ఎక్స్ ట్రా బహుమతులు అని కూడా ప్రకటించారు. ఎక్కువమందిని చేర్పిస్తే కార్లు ఇస్తామని ఆశ పెట్టారు. బ్యాంకాక్‌, శ్రీలంక, సింగపూర్ టూర్లు అంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయించిన కొందరికి రూ.5వేల చొప్పున క్యాష్ కూడా చెల్లించారు.

రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన ఇంద్రకిరణ్‌ అనే వ్యాపారవేత్త, అతని భార్య ఈ కంపెనీ గురించి తెలిసింది. భారీ లాభాలు వస్తామని నమ్మారు. ఈ కంపెనీ ఎండీ జిన్నా శ్రీకాంత్‌, మేనేజర్‌ భాస్కర్‌యాదవ్‌ను కలిసి రూ.లక్ష చెల్లించి అగ్రిమెంట్ తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. దీంతో వ్యాపారి ఇంద్రకిరణ్‌ జనవరి 23న ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన శ్రీకాంత్‌ పారిపోయాడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ గతంలోనూ గొలుసుకట్టు దందాలతో మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అసలు విషయం బైటపడటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.