Konaseema Tension : ఆందోళనకారులపై చర్యలు తప్పవు-హోం మంత్రి తానేటి వనిత

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే పెట్టామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.

Konaseema Tension : ఆందోళనకారులపై చర్యలు తప్పవు-హోం మంత్రి తానేటి వనిత

Taneti Vanitha

Konaseema Tension : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే పెట్టామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. ఈరోజు జిల్లా పేరు మార్పుపై అమలాపురం చెలరేగిన హింసాత్మక సంఘటనలు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ…. పేరు మార్చిన తర్వాత  ఇప్పుడు కొందరు సంఘ విద్రోహశక్తులు వెనుక ఉండి అమలాపురంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ అల్లర్లకు పాల్పడిన వారిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.

ఆందోళన కారులు చేసిన రాళ్ల దాడిలో 20 మంది పోలీసులకు గాయాలు అయ్యాయని ఆమె తెలిపారు. నిరసనకారులు ప్రైవేటు స్కూలు వాహనాన్ని దగ్దం చేశారు, పోలీసు జీప్ పై కూడా రాళ్ల దాడి చేశారు… కొందరు అల్లర్లు చెలరేగేలా వ్యవహరించడం బాధాకరం అని ఆమె అన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని…. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నావారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై ఈరోజు అమలాపురం భగ్గుమంది. జిల్లా పేరును కోనసీమ జిల్లా అనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో జరిగిన భారీ ఆందోళన హింసాత్మకంగా మారింది. కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి అమలాపురం వీధుల్లో తిరిగారు. వినతి పత్రాలతో అమలాపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు.

144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు పోలీసులు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల యత్నించగా.. లాఠీచార్జ్‌తో వారిని చెదరగొట్టారు. మరికొందరు యువకులు అమలాపురం బస్‌స్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి గన్‌మెన్ సహా 20 మంది గాయపడ్డారు. యువకుల నినాదాలు, పోలీసుల లాఠీఛార్జ్, రాళ్లదాడితో అమలాపురం రణరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లాల పునర్‌విభజన తర్వాత తొలిసారి పేరును వ్యతిరేకిస్తూ ఇంత భారీ ఆందోళన చెలరేగడం ఇదే తొలిసారి. పునర్‌విభజన సమయంలో జిల్లాకు కోనసీమ అని పేరు పెట్టారు. అయితే దళిత సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. ఆందోళన కారులు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కార్యాలయాన్ని, ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు.  ఆ సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపైకి రాళ్లు రువ్వారు. ప్రస్తుతం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రజలందరూ సంయమనం పాటించి…. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి