కిలాడీ లేడీ : భర్తతో కలిసి వ్యాపారవేత్తకు హనీట్రాప్

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 07:10 AM IST
కిలాడీ లేడీ : భర్తతో కలిసి వ్యాపారవేత్తకు హనీట్రాప్

సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసింది. తర్వాత సదరు వ్యాపారవేత్తను ఓ రిసార్ట్ కు పిలిపించి డబ్బులు డిమాండ్ చేసింది. అతడికి గన్ గురి పెట్టి రూ.20 లక్షలు వసూలు చేసింది. అంతేకాకుండా అతడితో మరో కోటి రూపాయలకు బాండు రాయించుకుంది. బాధిత వ్యాపారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో హనీ ట్రాప్ భాగోతం వెలుగులోకి వచ్చింది.

కనిష్క, విజయ్ కుమార్ లు భార్యభర్తలు. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. వీరిద్దరూ మూడు నెలలుగా వ్యాపారులను హనీ ట్రాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో కనిష్క ఫ్రెండ్ షిప్ స్టార్ట్ చేసింది. మూడు నెలలకు పైగా హోటళ్లు, రిసార్టులకు వీళ్లిద్దరూ కలిసి తిరిగారు. ఇలా కనిష్కతో వ్యాపారవేత్త సన్నిహితంగా బయట ఉన్నప్పుడు ఆమె భర్త ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు.

దంపతులిద్దరూ కలిసి పక్కా ప్లాన్‌తో స్పై ఆపరేషన్ చేశారు. నెల రోజుల క్రితం శంషాబాద్ సమీపంలోని రిసార్ట్‌కు వ్యాపారవేత్తతో కలిసి కనిష్క వెళ్లింది. అక్కడ అతనికి మత్తుమందు ఇచ్చింది. అతను రిసార్టులోకి వెళ్లి పడుకున్న తర్వాత కనిష్క, విజయ్ కుమార్ వ్యాపారవేత్త దగ్గరకు వెళ్లి అతనితో వొల్గర్ గా ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి సినిమా సీన్ క్రియేట్ చేశారు. కనిష్కను భర్త విజయ్ కుమార్ రక్తం వచ్చేట్లు కొట్టినట్టు, ఆమె ఒంటిపై స్వల్పగాయాలయ్యేట్లు చేసి.. ఆ గదిలో ఫర్నీచర్‌ను కూడా చిందర వందర చేశారు.

స్పృహలోకి వచ్చిన వ్యాపారిని విజయ్ కుమార్ తీవ్రంగా బెదిరించాడు. నా భార్యతో సరసమాడతావా ? అంటూ రెచ్చిపోయాడు. గన్ తీసి వ్యాపారికి గురిపెట్టి చంపేస్తానన్నాడు. దీంతో భయపడిన వ్యాపారి రూ. 20 లక్షల నగదు తెప్పించి వారికి ఇచ్చాడు. మరో కోటి రూపాయలకు బాండ్ కూడా రాసిచ్చాడు. అంతా అయిపోయింది ఇక తన విషయం బయట పడదనుకున్న వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్ అయిపోయాడు.
 
మళ్లీ డబ్బుల కోసం కనిష్క, విజయ్ కుమార్ బెదిరింపులకు గురిచేశారు. దీంతో వ్యాపారవేత్త మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్ డిసీపీ నేతృత్వంలోని పోలీసు బృందం ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా హనీ ట్రాప్ కు పాల్పడుతున్న కనిష్క, విజయ్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ వ్యాపారే కాకుండా మరికొంత మంది కూడా వీరి వలలో పడ్డట్లు గుర్తించారు. ఓ ఎన్ఆర్ఐ కూడా వీరి బారిన పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అమెరికాలో నివసించే ఓ ఎన్ఆర్ఐ న్యూడ్ వీడియోలను కనిష్క సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు విచారణలో వెల్లడైంది.