దారుణం : కృష్ణ జింకను చంపిన వేటగాళ్లు

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 12:51 PM IST
దారుణం : కృష్ణ జింకను చంపిన వేటగాళ్లు

నాగర్ కర్నూలు : జిల్లాలో జింకల వేట యధేచ్ఛగా సాగుతోంది. ఇష్టానుసారంగా వేటగాళ్లు జింకలను వేటాడుతూ వాటిని హతమార్చుతున్నారు. కాసుల కక్కుర్తికి వన్యప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ ప్రాంతం సోమశిల సమీపంలో కృష్ణ జింకను చంపారు. వేటగాళ్లు ఉచ్చులు పెట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్టు అధికారులు ఓ వేటగాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు అటవీప్రాంతాల్లో ఫారెస్టు అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. జింకలను చంపుతున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమశిల సమీపంలో జింక మాంసం దొరికింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ, రాష్ట్ర పక్షులు, జంతువులు, వన్యప్రాణులను చంపడం నేరం, వాటిని చంపితే కఠిన శిక్షలు పడుతాయి. అయినా కొంతమంది డబ్బుల కోసం వాటిని వేటాడి చంపేస్తున్నారు.