Abids SBI Gun Firing : హైదరాబాద్ ఎస్బీఐలో కాల్పులు.. ఎగతాళి మాటలే కారణం

Abids SBI Gun Firing : హైదరాబాద్ ఎస్బీఐలో కాల్పులు.. ఎగతాళి మాటలే కారణం

Abids Sbi Gun Firing

Abids SBI Gun Firing : హైదరాబాద్ ఎస్బీఐలో కాల్పుల ఘటనకు ఎగతాళి మాటలే కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్, బాధితుడు సురేందర్ రెడ్డి మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. సర్దార్ ఖాన్ ను సురేందర్ రెడ్డి పదే పదే ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడుతుండే వాడని, ఎంత వద్దని చెప్పినా వినేవాడు కాదని పోలీసులు చెప్పారు. ఇవాళ కూడా మరోసారి సురేందర్ రెడ్డి సర్దార్ ఖాన్ ను ఎగతాళి చేశాడని, అలా మాట్లాడొద్దని రెండుమూడు సార్లు చెప్పినా సురేందర్ రెడ్డి వినకపోవడంతో తట్టుకోలేకపోయిన సర్దార్ కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. బ్యాంకు పేరుతో నమోదై ఉన్న లైసెన్స్డ్ డీబీబీఎల్ గన్ తో సర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

వరంగల్ కు చెందిన సర్దార్ ఖాన్ ఎస్బీఐలో 9ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి క్లీనింగ్ విభాగంలో ఏడు ఎనిమిదేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నాడు. అబిడ్స్ కాల్పుల ఘటనపై ఏసీపీ వెంకట్ రెడ్డి వివరాలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు కాల్పులు జరిగాయన్నారు.

అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ బ్రాంచ్ ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సర్దార్ ఖాన్ ఒప్పంద ఉద్యోగి సురేందర్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగులు, అక్కడకి వచ్చిన కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి సర్దార్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు గాయపడిన సురేందర్ కు హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సురేందర్ పక్కటెముకల్లో బుల్లెట్లు దిగాయని డాక్టర్లు తెలిపారు. సర్దార్ ఖాన్, సురేందర్ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆర్థిక లావాదేవీలు వివాదానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే ఎగతాళి మాటలే కాల్పులకు కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.