Kukatpally ATM Robbery : కూకట్ పల్లి ఏటీఎం దొంగలను గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ కూకట్ పల్లిలో రెండురోజుల క్రితం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వద్ద ఏటీఏం లో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి డబ్బు దోచుకుపోయిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు వలస వచ్చి కూలీ పని చేసుకునే పాతనేరస్తులు ఈ దోపిడీ చేసినట్లుగా గుర్తించారు.

Kukatpally ATM Robbery  : కూకట్ పల్లి ఏటీఎం దొంగలను గుర్తించిన పోలీసులు

Kukatpally Atm Robbery

Kukatpally ATM Robbery : హైదరాబాద్ కూకట్ పల్లిలో రెండురోజుల క్రితం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వద్ద ఏటీఏం లో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి డబ్బు దోచుకుపోయిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు వలస వచ్చి కూలీ పని చేసుకునే పాతనేరస్తులు ఈ దోపిడీ చేసినట్లుగా గుర్తించారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గురువారం, ఏప్రిల్ 29 మధ్యాహ్నం గం.1.50 నిమిషాలకు కూకట్ పల్లి పటేల్‌ కుంటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతున్నారు. ఆ సమయంలో ఆల్విన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. కస్టోడియన్‌ శ్రీనివాస్‌, సెక్యూరిటీ గార్డు అలీ బేగ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5 లక్షలు దోచుకెళ్లారు.

దుండగుల కాల్పుల్లో అలీ బేగ్‌, శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీ బేగ్‌ మరణించగా, శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, ఘటనా స్థలంలో లభించిన వేలి ముద్రలు, సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇద్దరిలో ఒకరు బిహార్‌కు చెందినవాడు కాగా, మరో దుండగుడు మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవాడు.

ఈ ఇద్దరు నిందితులు గతంలో దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారని తెలిసింది. నిందితులు ఏప్రిల్ 16న జీడిమెట్ల అయోధ్యనగర్‌ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థను టార్గెట్‌ చేశారు.  ఆ రోజు రాత్రి గం. 9.30 ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్‌ రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు.

అదే సమయంలో హెల్మెట్, మాస్క్‌ ధరించిన ఇద్దరు దుండగులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్‌కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆయన వద్ద ఉన్న నగదు బ్యాగ్‌తోపాటు, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యారు. రమేష్ కుమార్ సెల్ ఫోన్ ను నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు.

ఈ సారి ఏటీఏం లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రెక్కీ నిర్వహించారు. ఏటీఎం లను ధ్వంసం చేయటం అంత తేలిక కాదు అనుకుని వాటిలో డబ్బు నింపడానికి వచ్చేవాహనం దగ్గరే దోపిడీ చేయాలని  నిర్ణయించుకున్నారు.

ముందుగా ఎక్కడ దోపిడీ చేయాలో నిర్ణయించుకున్నారు. ఆ రోడ్డులో ఏటీఎంలోకి డబ్బు నింపడానికి వచ్చే వాహనాల రాకపోకలు గమనించారు. దోపీడీ చేసిన తర్వాత పారిపోవటానికి వీలున్న రోడ్లను రెక్కీ ద్వారా ముందే నిర్ణయించుకున్నారు.

ఏటీఎం చోరీకి బైక్ కావాలనుకున్నారు. అందుకోసం బాలానగర్‌ జోన్‌ పరిధి నుంచి ఓ పల్సర్‌ బైక్ ను చోరీ చేసి దాని నంబర్‌ ప్లేట్‌ తీసేసి వినియోగించారు. విజయ్‌నగర్‌ కాలనీలో ఏటీఎం చోరీ చేసి కేపీహెచ్‌బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని, నగదు తీసుకుని లింగంపల్లి వరకు వెళ్లాడు.

అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్‌ డోర్‌పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్‌లో సేకరించిన  వేలి ముద్రలతో సరిపోయాయి. అలా అనుమానితులను గుర్తించిన పోలీసులు  సీసీటీవీ కెమెరా ఫుటేజి సాయంతో ముందుకు వెళ్లారు. నిందితులను గుర్తించిన పోలీసులు …బాలానగర్‌లో ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు దొరికిందిలా..
గతంలో జీడిమెట్ల లోని లక్ష్మీ మనీ ట్రాన్సఫర్ సంస్ధలో చోరీచేసిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డైన చిత్రాలు, గురువారం ఏటీఎం లో చోరీ చేసిన  రెండు ఘటనల్లోనూ.. ఒక నిందితుడు ఒకేరకమైన హెల్మెట్, ఓకే రకమైన ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. వెనుక కూర్చున్న నిందితుడు రెండు ఘటనల్లోనూ హెల్మెట్ పెట్టుకోకపోవటం.. పారిపోతున్న సమయంలో వారి ముఖాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవటంతో వారిని పోలీసులు  త్వరగా గుర్తించారు.

ఈ ఇద్దరు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటూ…. గత కాలంగా రోజువారి కూలీలుగా పని చేస్తున్నట్లు పోలీసు రికార్డులో ఉంది. మరో రెండు రోజుల్లో రెండో నిందితుడు దొరకగానే పోలీసులు దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో పోలీసులు వివరాలను వెల్లడించేందుకు గోప్యతను పాటిస్తున్నారు.