Man Eat Snake : పిచ్చి పీక్స్… లైక్స్ కోసం బతికున్న పాముని తిన్నాడు

Man Eat Snake : పిచ్చి పీక్స్… లైక్స్ కోసం బతికున్న పాముని తిన్నాడు

Man Eat Snake

Man Eat Snake : ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. చాలామంది 24గంటలూ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. తాము చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. వాటికొచ్చే లైకులు, వ్యూస్, కామెంట్స్ చూసి మురిసిపోవడం.  ఇక సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వాలని కొందరు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిచ్చి పనులు చేస్తున్నారు. రాత్రికిరాత్రి పేరు తెచ్చుకునే క్రమంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. మూగజీవాలను హింసిస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడు ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ హైదరాబాద్‌ వెర్షన్‌’ పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాము పిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెం కొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాపం.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. ‘అరేయ్‌ సాజిద్‌.. నీళ్ల బాటిల్‌ తీసుకురా..!’ అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది.

ఈ దారుణంపై జంతుప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు యువకుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా, పాముని తిన్న యువుకుడు గతంలోనూ ఇలానే వికృతంగా వ్యవహరించాడు. కుక్కలను భవనం పైనుంచి విసిరేసిన ఘటనలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. అయినా అతడిలో మార్పు లేదు. మరోసారి వికృతంగా వ్యవహరించాడు.