FaceBook Friend : సోషల్ మీడియాలో పరిచయం…పెళ్లి,ఉద్యోగం పేరుతో టోకరా..

ఫేసుబుక్ ద్వారా   పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FaceBook Friend : సోషల్ మీడియాలో పరిచయం…పెళ్లి,ఉద్యోగం పేరుతో టోకరా..

Couple Arrested

FaceBook Friend : సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతున్నట్లు కనపడుతుంటుంది ఒకోసారి.  ఎందుకంటే మోసగాళ్లు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఫేసుబుక్ ద్వారా   పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. వారికి మూడు నెలల చిన్నారి ఉండటంతో పోలీసులు  భార్యకు సీఅర్పీసీ-41 A కింద నోటీసులు జారీ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా కోస్గికి చెందిన పున్నం  నవీన్ కుమార్ అనే యువకుడు గతేడాది శిరీష అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా హైదరాబాద్ వచ్చి హోటళ్ళలో బసచేసి తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లు.  వీళ్లు జల్సాల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించటానికి ప్లాన్ వేశారు. అందులో భాగంగా శిరీష ఫేస్ బుక్ లో స్నేహ రెడ్డి పేరుతో ప్రోపైల్ క్రియేట్ చేసింది.

ఫేస్ బుక్ లో సింగిల్ స్టేటస్ ఉన్న యువకులను చూసి వారికందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అందులో అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చేసరికి ఒంటరిగా ఉన్న యువకులు వెంటనే యాక్సెప్ట్ చేసి ఆమెతో చాటింగ్ చేసేవాళ్లు.  ఒకోసారి నవీన్ కూడా శిరీష లాగా వారితో చాట్ చేసేవాడు. ఈ రకంగా భార్యా భర్తలిద్దరూ యువకులను మోసంచేయటం మొదలెట్టారు.

ఫేస్ బుక్ చాటింగ్ తర్వాత క్రమేపి ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాట్సప్ చాటింగ్ లోకివచ్చేవారు.  అక్కడి నుంచి నిదానంగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేది శిరీష.  కొన్నాళ్లకు పెళ్లి ప్రస్తావన తెచ్చేది.  పెళ్లి చేసుకోవాలంటే మంచి ఉద్యోగం కావాలిగా అంటూ వారితో చెప్పేది. తన పరిచయస్తుల ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని వారికి నమ్మబలికేది. ఆపై నవీన్ రంగంలోకి దిగి వారి వద్దనుంచి డబ్బులు గుంజేవాడు.

బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే శిరీష మాట్లాడి వారి ఆవేశాన్ని తగ్గించేది.  ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడికి ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌‌లో ఉద్యోగం వేయిస్తానని చెప్పి రూ.8లక్షలు తీసుకుని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.

యువకులు వద్దనుంచి తీసుకున్న డబ్బులతో ఈ జంట గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవారు. నవీన్ అరెస్ట్  విషయం తెలుసుకున్న శిరీష మరోక వ్యక్తిని వెంటపెట్టుకుని పోలీసు స్టేషన్ కు వచ్చింది.  అతనితో రాజీ పడుతున్నామని…. రూ.2 లక్షలు ఇచ్చేస్తున్నామని… తన భర్తను విడిచిపెట్టమని కోరింది.

అయితే ఈ బాధితుడు   భార్య,భర్తల బాగోతం తెలుసుకుని తానూ ఫిర్యాదు చేశాడు. దీంతో దంపతుల మీద ఇంకో కేసు నమోదైంది. నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరికి మూడు నెలల చిన్నారి ఉందన్న విషయం తెలుసుకుని శిరీషకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు  జరుగుతోంది.