ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న వాహానాలకు చలానాల షాక్

  • Published By: chvmurthy ,Published On : April 17, 2019 / 03:42 AM IST
ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న వాహానాలకు చలానాల షాక్

హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి.  కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గోన్న ద్విచక్ర వాహానదారులకు హైదరాబాద్ పోలీసులు షాకిస్తున్నారు. ర్యాలీల్లో హెల్మెట్ లేకుండా వాహానం నడపినందుకు ఇప్పుడు చలానాలు విధిస్తున్నారు.
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు హైదరాబాద్ నగరంలో పలు రాజకీయ పార్టీలు ప్రచారం నిమిత్తం ర్యాలీలు నిర్వహించాయి. ఈ ర్యాలీల్లో ఆయా పార్టీల  కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గోన్నారు.  ఈ ర్యాలీల్లో హెల్మెట్ లేకుండా  పాల్గోన్న కార్యకర్తలకు పోలీసు శాఖ ఇప్పుడు చలానాల రూపంలో షాకిస్తోంది.  అందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసు శాఖ ఇప్పటికే మొదలెట్టింది. 

నగరంలో ర్యాలీలకు అనుమతి ఇచ్చేటప్పుడే  మోటార్‌ వాహన చట్టం ప్రకారం  నిబంధనలకు లోబడే వాహనాలు నడపాలనే విషయాన్ని గుర్తు  చేస్తూ పోలీసు శాఖ అనుమతులు మంజూరు  చేసింది. మోటారు  వాహాన చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్, స్కూటర్ నడపడం చట్టరీత్యా నేరం. ర్యాలీలో పాల్గోనే కార్యకర్తలు తమ ద్విచక్ర వాహనాలపై హెల్మెట్‌ ధరించాలని ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకునే సమయంలోనే పోలీసులు ఆయా పార్టీల నేతలకు స్పృష్టం చేశారు. ఈ ర్యాలీల్లో పాల్గోన్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా హెల్మెట్ లేకుండానే పాల్గోన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో పలుమార్లు ప్రచారాలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో, ఎన్నికల ప్రచారాల్లోనూ హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహనాన్ని నడిపిన వారందరికీ చలానా విధిస్తామని ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీకే ఓటు వేయాలంటూ ప్రధాన రాజకీయ పార్టీలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకూ పాదయాత్రలు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. వీటి తోపాటు ఓటర్లను ఎక్కువ సార్లు కలుసుకునేందుకు వారి వారి నియోజక వర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో రెండు మూడు సార్లు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఇక్కడే పోలీసు శాఖ తమ కెమెరాలకు పని చెప్పింది. బైక్ ర్యాలీల్లో హెల్మెట్ ధరించకుండా పాల్గోన్న కార్యకర్తల బైక్‌ల నంబర్లను పోలీసులు సేకరించారు. పోలీసులు తమ కెమెరాలతో తీసిన ఫొటోలు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలు తీసిన వీడియోలను ర్యాలీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, ఈ-చలాన్‌ విభాగానికి అంద చేశారు. అక్కడున్న టెక్నికల్ సిబ్బంది ర్యాలీల్లో హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారి నెంబర్లను జాగ్రత్తగా గుర్తించి, ఈ-చలాన్‌ విభాగం సాఫ్ట్‌వేర్‌లోకి పంపుతున్నారు. అంతకు ముందు ఆ వాహనంపై పెండింగ్‌ చలానాలున్నాయా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల ర్యాలీల్లో కలిపి  నిబంధనలకు విరుధ్దంగా వాహానం నడిపినవారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. వీరందరికీ పంపించేదుకు  ఈ-చలాన్‌లను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి బైక్‌ ర్యాలీలు జరిగిన మరుసటిరోజు నుంచే జరిమానాల చాలానాలు పంపించాలని  పోలీస్‌ అధికారులు భావించినా మొత్తం పోలింగ్‌  ప్రక్రియ పూర్తయ్యాకే ఈ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరిద్దామని భావించి వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ జరిగిన మొత్తం రోజుల్లో ఆ వాహనం ఎన్నిసార్లు వాహన చట్టాన్ని ఉల్లంఘించిందో లెక్క తీసి మొత్తంగా చలానాలు పంపుతున్నారు. దీంతో పోలీసు శాఖకు భారీ స్ధాయిలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.