నిర్లక్ష్యమే నిండా ముంచింది : ఆదిలాబాద్ పత్తిరైతు కన్నీటి వ్యధ

  • Published By: chvmurthy ,Published On : February 16, 2019 / 03:25 PM IST
నిర్లక్ష్యమే నిండా ముంచింది : ఆదిలాబాద్ పత్తిరైతు కన్నీటి వ్యధ

ఆదిలాబాద్ : కల్తీ  పత్తి విత్తనాలు కాటేసి, రైతన్నలు నిండా మునిగిన తర్వాత వ్యసాయ శాఖ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారు. సీజన్‌ ప్రారంభంలో కల్తీ విత్తనాల దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పంట నష్టపోయిన తర్వాత  కంటి తుడుపు చర్యగా దాడులు ప్రారంభించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కల్తీ, నకిలీ, నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్‌లో రాజ్యమేలినప్పుడు ఉదాసీనంగా  ఉండిపోయిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది.  

తెలంగాణాలో పత్తి ఎక్కువగా సాగవుతుంది. దీంతో సీడ్స్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేకపోవడంతో నకిలీ విత్తన తయారీదారులు రెచ్చిపోయారు. రైతులకు నాణ్యతలేని విత్తనాలను అంటగట్టారు. దీంతో దిగుబడిరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనాలు విక్రయించే సమయంలో సైలెంట్‌గా ఉన్న వ్యవసాయాధికారులు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఫెర్టిలైజర్‌ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాము నిండా మునగాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విత్తన విక్రేతలు మాఫియగా మారారు. భారీ దిగుబడి వస్తుందంటూ మాయమాటలతో రైతులను నమ్మించి  కల్తీ కాటన్‌ సీడ్‌  అంటకట్టారు. తీరా సాగుచేసిన తర్వాత దిగుబడి రాలేదు. దీంతో అటు విత్తన కంపెనీలతోపాటు ఇటు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వర్షాభావం, అధిక వర్షాన్ని తట్టుకుని మంచి దిగుబడి ఇస్తాయని విత్తనాల కంపెనీల ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి, వారు అంటకట్టిన విత్తనాలతో పత్తి సాగు చేశారు. కల్తీ విత్తనాలు కావడంతో పత్తి చెట్లు పెరిగినా. పూత, పిందె రాలేదు. అప్పట్లోనే అన్నదాతలు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖపై విమర్శలు రావడంతో మేల్కొన్న అధికారులు ఇప్పుడు కల్తీ విత్తనాలు విక్రయించిన షాపులపై దాడులు చేస్తున్నారు. 

వ్యవసాయ శాఖ అధికారుల దాడుల్లో క్వింటాళ్ల కొద్దీ నాసిరకం, నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, కడెం, భోథ్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, భైంసా, చెన్నూర్‌, లక్సెట్టిపేట, ఉట్నూర్, మందిమర్రిలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఓ ఎరువుల వ్యాపారి గుజరాత్‌ నుంచి తెప్పించిన 90 క్వింటాళ్ల కల్తీ కాటన్‌ సీడ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3 కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందని లెక్క కట్టారు. అలాగే బీమారంలోని రెండు ఎరువుల దుకాణాల్లో 151 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడ్డాయి. వ్యవసాయ శాఖ అధికారులు ముందు నుంచే ఈ విధంగా  కల్తీ, నాసిరకరం, నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపి ఉంటే తమకు నష్టం రాకపోయేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ముందు నుంచీ కల్తీ విత్తనాలపై నిఘా పెట్టి ఉంటే.. తమకు మేలు జరిగేదని రైతులు అంటున్నారు.
 వచ్చే సీజన్‌కైనా కల్తీ విత్తనాల బెడద తలెత్తకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.