బాప్ రే.. వెలుగులోకి దేవికారాణి ‘రియల్’ దందా, మాదాపూర్‌లో ఇళ్ల స్థలాల కోసం రూ.4.47 కోట్లు చెల్లింపు

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 10:37 AM IST
బాప్ రే.. వెలుగులోకి దేవికారాణి ‘రియల్’ దందా, మాదాపూర్‌లో ఇళ్ల స్థలాల కోసం రూ.4.47 కోట్లు చెల్లింపు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు స్కామ్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఎంఎస్‌ స్కాం ప్రధాన సూత్రధారి దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ తాజాగా ఆమె రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలను సైతం వెలుగులోకి తెచ్చింది. భారీగా ఆస్తుల కొనుగోలుకు దేవికారాణి వేసిన స్కెచ్ బయటపెట్టింది. మాదాపూర్ లో ఇళ్ల స్థలాల కొనుగోలు కోసం ఆమె ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏకంగా రూ.4.47 కోట్లు చెల్లించిన విషయం తెలిసి అధికారులు షాక్ తిన్నారు. ఆ డబ్బుని స్వాధీనం చేసుకున్నారు.

Telangana ESI Scam Rs 4.47 Crore Seized From Woman Officials - Sakshi

వెలుగులోకి దేవికారాణి రియల్ దందా:
ఐఎంఎస్‌ స్కాం ప్రధాన సూత్రధారి దేవికారాణి ‘రియల్‌’ స్టోరీని చెప్పే నిదర్శనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె అవినీతికి తిరుగులేని ఆధారాలు లభిస్తున్నాయి. భారీగా ఆస్తులు కొనుగోలు చేసేందుకు.. తనతో అంటకాగిన ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దేవికారాణి పోగుచేసి ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి చెల్లించిన మొత్తాలు బయటపడ్డాయి. ఆ డబ్బు లెక్కపెడితే.. అక్షరాల నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల పైచిలుకే అని తేలింది.

4.47 కోట్లు దేవికారాణి ‘రియల్‌' స్టోరీ!

భారీగా ఆస్తులు కూడబెట్టేందుకు ప్లాన్:
ఐఎంఎస్ మందుల కొనుగోలు స్కాంపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు తవ్వినకొద్దీ అవినీతి పుట్ట బద్దలవుతోంది. ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దేవికారాణి, అమెతో అంటకాగిన ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్‌ వేసినట్టు తేలింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో ఆరు ఇళ్ల స్థలాలు, 15వేల చదరపు గజాల కమర్షియల్‌ స్పేస్‌ కొనుగోలుకు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీబీకి డబ్బు తిరిగి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ:
వివరాలతో ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు లేఖలు రాయగా, వాస్తవమేనని ఆ సంస్థ సమాధానం పంపింది. దేవికారాణి, నాగలక్ష్మి కలిసి ఆస్తుల కొనుగోలు కోసం రియల్‌ఎస్టేట్‌ సంస్థకు రూ.4.47 కోట్లు చెల్లించారు. ఈ మొత్తాన్ని ఏసీబీ అధికారులు ఆ రియల్‌ఎస్టేట్‌ సంస్థ నుంచి మంగళవారం(సెప్టెంబర్ 1,2020) స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదులో రూ.3కోట్ల 75లక్షల 30వేలు దేవికారాణికి చెందినవి కాగా, మిగిలిన రూ.72 లక్షలు నాగలక్ష్మివి అని నిర్ధారించారు. ఈ మొత్తంలో నుంచి దేవికారాణి తన బినామీల పేరిట రూ.22 లక్షలు చెల్లించినట్టు తేలింది.

దేవికారాణి వాటా రూ.3.75కోట్లు:
దేవికారాణి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ రెసిడెన్షియల్‌ వెంచర్‌లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లో లేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2కోట్ల 29లక్షల 30వేల మొత్తాన్ని చెక్కులు, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు.

కీసర తహసీల్దార్ రికార్డు బద్దలు:
ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్‌ డెవలపర్‌కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్‌ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్‌ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2వేల నోట్ల కట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్‌ దగ్గర లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్టు అయ్యింది.