Delhi: 45 తుపాకులు తీసుకొచ్చి ఢిల్లీ విమానాశ్ర‌యంలో దొరికిపోయిన దంపతులు

Delhi: 45 తుపాకులు తీసుకొచ్చి ఢిల్లీ విమానాశ్ర‌యంలో దొరికిపోయిన దంపతులు

Guns

Delhi: జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే ఇద్ద‌రు వ్యక్తులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో 45 తుపాకుల‌తో క‌స్ట‌మ్స్ అధికారులకు ప‌ట్టుబ‌డ్డారు. వారిద్ద‌రు భార‌తీయులేన‌ని అధికారులు తెలిపారు. ఆ గ‌న్స్ అన్నీ నిజ‌మైన తుపాకులేన‌ని తెలుస్తోంద‌ని ఉగ్ర‌వాద వ్య‌తిరేక విభాగానికి చెందిన జాతీయ భ‌ద్ర‌తా సిబ్బంది (ఎన్ఎస్జీ) అధికారులు తెలిపారు. ఆ 45 తుపాకుల‌ను మ‌రింత ప‌రిశీలించిన త‌ర్వాత అవి నిజ‌మైన తుపాకులేనా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ భార్యాభ‌ర్త‌ల‌ని తెలుస్తోంది. వారిద్ద‌రు జూలై 10న వియ‌త్నాం నుంచి భార‌త్‌కు తిరిగి వ‌చ్చార‌ని అధికారులు చెప్పారు. జ‌గ్జీత్ సింగ్ రెండు ట్రాలీ బ్యాగుల్లో తుపాకుల‌ను తీసుకొచ్చాడ‌ని, వాటిని అత‌డికి మంజీత్ సింగ్ ఇచ్చార‌ని అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల ప్యారిస్, ఫ్రాన్స్‌లో ప‌ర్య‌టించిన అనంత‌రం మంజీత్ సింగ్ ఆ రెండు బ్యాగుల‌ను జ‌గ్జీత్ సింగ్‌కు వియ‌త్నాంలో ఇచ్చాడ‌ని అధికారులు వివ‌రించారు. వియ‌త్నాం నుంచి వాటిని జ‌గ్జీత్ సింగ్ భార‌త్‌కు తీసుకొచ్చాడ‌ని చెప్పారు. ఈ 45 తుపాకుల విలువ మొత్తం క‌లిపి రూ.22,50,000 ఉంటుంద‌ని వివ‌రించారు. జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ గ‌తంలోనూ ట‌ర్కీ నుంచి భార‌త్‌కు 25 తుపాకులు తీసుకొచ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. అధికారులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.